ఓం శ్రీ గురుభ్యోన్నః  సమస్త సన్మంగళాని భవంతు ( మా చిన్నప్పుడు ఉషశ్రీ గారు  హనుమాన్చాలీసా  చదివేముందు రేడియో లో వినిపించేవారు. చిరస్మరణీయం ).. 
 అందరికీ   మన్మధ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు... 
 ఈ పోస్ట్ పోయిన సంవత్సరం రామ నవమికి వ్రాసినది . అనివార్య కారణాల  వల్ల నేను టైప్ చేయలేకపోతే నా స్నేహితురాలు, ప్రముఖ బ్లాగర్ భారతిగారు టైపు చేసి ఇచ్చినప్పటికీ పోస్ట్ చెయ్యలేకపోయాను ..   ఈ సంవత్సరం ముందుగానే ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటే , రేపటినుండి  తొమ్మిది రోజులు రామ నవమి వరకు కొందరు రామవ్రత దీక్షలో వుంటారు . ఈ తొమ్మిది రోజులూ కేవలం రామ నామం ని మాత్రమె ఆశ్రయించేవారు ఎందఱో .. వారికై మరియు నాకై ఈరోజే పోస్ట్ చెయ్యాలి అనిపించింది.. తప్పులున్న సవరించగలరు.

శ్రీ రామ జయ రామ జయ జయ రామ ..
ఆపదామప హర్తారం దాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ........... 

రామావతారం - నిత్యకళ్యాణం పచ్చతోరణం

                             సాధారణంగా జీవులు ఏ కారణాల వల్ల అయినా తమ మనుగడ దుర్లభం అయిన సందర్భంలో ఆదుకొమ్మనిభగవంతున్ని వేడుకోవడం పరిపాటి. ఆ భగవంతుడు భువి మీదకు దిగిరావలసిన పరిస్థితికి దారిచూపేంతగా రోదిస్తాడు. తగిన తప్పనిసరి
పరిస్థితి ఎదురైనప్పుడు మనకు తోడుగా ఈ భూమి మీదకు మానవరూపంలోనే వస్తాడు. 
                         
   మోక్షదాత అయిన శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములను గురించి మనకు తెలుసు. కానీ, అన్ని అవతారములలోనూ మనకు అత్యంత ప్రియమైనవి, ధర్మాన్ని బోధించేవి, జీవతత్త్వాన్ని తెలియజేసి ముముక్షత్వానికి దగ్గర చేర్చగలిగినవి రెండు అవతారములు. ఒకటి రామావతారం కాగా రెండవది కృష్ణావతారం.
                             మహామహులు, మహా తపస్సంపన్నులు, మహర్షులు, రాజర్షులు, దేవాతాది జనులు, పదహారువేలమంది గోపికలుగా శ్రీకృష్ణుని సాంగత్యంలో ఈ అనంతవిశ్వానికి తెలియజేసిన ఆనందతత్త్వం, ప్రేమతత్త్వం ఒక ఎత్తు అయితే, ధర్మసంస్థాపనకై ప్రజల సంరక్షణార్ధమై ఒక సామాన్య మానవుడుగా యోనుడైన  శ్రీరామచంద్రుని జననం మరోఎత్తు.
                             ఓం నమో నారాయణ లోని "రా" అక్షరం, ఓం నమశ్శివాయ లోని "మ" అక్షరం కలసి "రామ" పదం శివకేశవుల లోని అర్ధనారీశ్వర తత్త్వాన్ని, ఏకత్వాన్ని ప్రకటింపజేసి శివుడు, కేశవుడు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే అన్న విశిష్ట అద్వైతంను స్పష్టం చేస్తాయి.          
               ధ్యానము, తపస్సు, భగవన్నామస్మరణ - ఈ మూడింటిలో ఏది గొప్పది అంటే, ధ్యానం ఏకాగ్రత కొరకు, తపస్సు మోక్షం కొరకు చేసేవి. అత్యంత కఠినతరమైనవి. అతితేలికగా ఆ భగవంతుని సన్నిధికి చేర్చేది నామస్మరణ మాత్రమే. అందులోనూ "రామ" నామస్మరణ అత్యంత పవిత్రమైనది. హృదయాలను ప్రేమ, ఆరాధన, పవిత్ర భావాలతో నింపుతుంది. అసత్యమార్గం నుండి సత్యమార్గానికి నడిపిస్తుంది. ధర్మనిష్టులను చేస్తుంది. పలకడానికి రెండక్షరాలే కానీ, పరమ పద సోపాన మార్గం చూపుతుంది. 

శ్రీరామ జయరామ జయ జయ రామ ... 
రామాయ రామభద్రాయ రామచంద్రాయ ... 
ఇలా తలచుకునే కొలదీ మది పులకరిస్తుంది. 

రామకధ - జననం ..............
                       రాజ్యంలో ఏర్పడిన విపరీత కరువుకాటకాల వలన ఆందోళన చెందిన రోమపాద మహారాజు తన ఆస్థాన వేదవిదులైన బ్రాహ్మణుల సలహాతో కశ్యప మహాముని మనుమడు, మృగీఋషి అనే గొప్ప బ్రాహ్మణ మునీశ్వరుని కుమారుడూ అయిన ఋష్యశృంగుని (నరజాతిని ఎరుగని) అనేక ఉపాయాలతో తన రాజ్యానికి రప్పించి, తన దత్తపుత్రిక మరియు దశరధమహారాజు కుమార్తె అయిన శాంతను యిచ్చి వివాహం చేసి, తన రాజ్యం సుభిక్షంగా ఉండేటట్లు చూశాడు.
దశరధమహరాజు తన మిత్రుడైన రోమపాదుని సహాయంతో ఋష్యశృంగుని తన కోసలరాజ్యానికి రప్పించి అశ్వమేధయాగం అనంతరం పుత్రకామేష్టి యాగం ప్రారంభించిన తర్వాత -
దేవతలందరూ బ్రహ్మదగ్గరకు వెళ్ళి బ్రహ్మ ఇచ్చిన వరాలతో మహాబలోపేతుడైన రావణుని వేధింపుల నుండి బయటపడి, అతని పీడా వదిలించుకోవడానికి ఏదైనా ఉపాయం చెప్పమని ప్రార్ధించగా బ్రహ్మదేవుడు వారితో - "సామాన్య మానవుని శక్తిని తక్కువగా అంచనా వేసి నన్నేమి చేయగలడు అన్న ధీమాతో రావణుడు మానవుని చేతిలో తన మృత్యువు కలుగరాదు అని వేడుకోలేదు. కావున మానవరూపంలోనే రావణుని నిర్జించడం జరగాలి" అని అనగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమైనాడు.
                      దేవతలు ఆ పరమాత్ముణ్ణి అత్యంత భక్తిశ్రద్ధలతో తమను కాపాడమని ప్రార్ధింపగా అభయమిచ్చి ఆ శ్రీమన్నారాయణుడు, ఆ జగత్పతి తాను భూమిపై అవతరించి, ఆ రాక్షసరాజుని వధించి 11000 సంవత్సారాలు భూమండలాన్ని పాలిస్తానని చెప్పాడు.
                       దశరధమహారాజు యజ్ఞం చేస్తుండగా యజ్ఞజ్వాలలో నుండి శ్యామల వర్ణం కలిగిన దేహంతో, సకల శుభలక్షణాలు కలిగిన ఒక దివ్యపురుషుడు ఆవిర్భవించి పాయసంతో నిండిన స్వర్ణపాత్రను మహారాజుకి ఇవ్వగా, దశరధుడు చేతులు జోడించి 'ఏ విధమైన సేవ చేయాలో తెలప'మని అడగగా, మహారాజు చేసిన రెండు యాగాల పుణ్యఫలం ఆ పాయసపాత్ర అని, ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలకు పంచడం ద్వారా నలుగురు కుమారులు ఉదయిస్తారని తెలిపి ఆ దివ్యపురుషుడు అంతర్ధానమైన్నాడు.
                      పాయసాన్ని రెండు భాగాలుగా విభజించి అందులో మొదటి సగభాగాన్ని కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగభాగాన్ని మరల రెండు భాగాలుగా చేసి, ఆ రెండు భాగాలలో మొదటి సగాభాగాన్ని సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన సగభాగాన్ని రెండుగా విభజించి, అందులో ఒకభాగాన్ని సుమిత్రకు, మిగిలిన భాగాన్ని కైకయికి యివ్వగా, ఆ పాయసాన్ని ఆ ముగ్గురు భార్యలూ ఆనందంగా స్వీకరించారు.
                       బ్రహ్మదేవుడు కొందరు దేవతలను విష్ణుమూర్తియొక్క రానున్న అవతారంలో ఆయనకు సహాయంగా వారివారి అంశలతో వానరులుగా, అత్యంత మేధావులై ఆయుధ ప్రయోగంలో నైపుణ్యం కలవారై, విష్ణుమూర్తితో సమానమైన పరాక్రమం కల్గి సూక్ష్మ దేహులుగా పుట్టామని ఆజ్ఞాపించగా, ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వల్ల సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తారుడు, కుభేరుని వల్ల గంధమాధుడు, విశ్వకర్మ వల్ల నలుడు, వరుణుడి వల్ల సుషేణుడు, వాయుదేవుని వల్ల హనుమంతుడు జన్మించారు. ఇక                      
అవతరించాడయా రాముడు, శ్యామవర్ణుడు        
అరుణ రంజిత నేత్రాలతో, దీర్ఘకాయుడై 
ఆజానుభాహుడై, సకల శుభలక్షణ 
సమలంకృతుడై, జగత్పతి 
మానవుడై సత్యరూపుడై రాముడై,
విష్ణుతత్త్వాలే లక్ష్మణ భరత శత్రుఘ్నులై  
శక్తివంతులై దశరధుని ప్రియనందనులై 
అవతరించాడయా రాముడు ఈ అవనిన.
                    రాముడు జన్మించిన తర్వాత సుమిత్ర ద్వారా విష్ణువు యొక్క ఆరవ అంశకు ప్రతినిధులుగా లక్ష్మణ శత్రుఘ్నులు, కైకయికి విష్ణుమూర్తి నాల్గవ అంశకు ప్రతినిధిగా భరతుడు జన్మించారు. అంతా అత్యంత ప్రకాశావంతులై ముద్దుగారుతూ ఉండగా దేవతలు పూలవర్షం కురిపించారు. ఆనందాతిరేకంతో గంధర్వులు గానాలాపనలు, అప్సరసలు నాట్యాలు ఆడారు. 

ఏమని వర్ణింతు రామా, అయోధ్యాపురి అదృష్టాన్ని 
ఆ ప్రజల మురిపాలను 
ఉదయించి ఊరుకున్నావా రామా ... 
సకల శుభలక్షణుడవై, దశరధుని గారాలబిడ్డవై 
పరాక్రముడివై, మహోన్నతుడివై 
విశ్వామిత్రుని అనుజ్ఞచే మారీచ సుబాహుల 
మృత్యువువై, బల అతిబల మంత్రధారుడవై 
మందహాసుడవై 
ఊరుకున్నావా రామా ... 
నిలువెల్లా దుష్టురాలైన తాటకి సంహారకుడైనావు 
దివ్యాస్త్ర జ్ఞానసంపద బొందావు 
అంతటితో ఊరుకున్నావా రామా ... 
ఇంద్రుడు మాయా అహల్యతో కూడి యుండ, భ్రమించి 
బండరాయిగా మార్చిన గౌతమున్ని మన్నించి 
అహల్యను మామూలు మనిషిగా చేశావు 
మహాశక్తివంతమైన శివధనస్సుని ఫటాలున 
పెళ్లుమని త్రుంచివేశావు 
అంతటితో ఊరుకున్నావా రామా ... 
మాతల్లి సీతమ్మ, ఆ అయోనిజని చేపట్టావు కదయ్యా, రామా!
'ఇదిగో సీత' అని నీ చేతికందించాడు కదయ్యా 
జనకుడు మహాపురుషుడు 
ఆ కళ్యాణ ఘట్టం వర్ణింపసాధ్యామా రామా!
లక్ష్మీనారాయణుల అద్భుతప్రకాశం వివరింప నా తరమా రామా!
పరశురాముని సవాలుని స్వీకరించి, విష్ణుధనస్సుతో పాటు 
దీర్ఘకాల తపశ్శక్తిని లాక్కున్నావు కదయ్యా రామా!
ఎంత సంతోషమయ్యా, నిత్య కల్యాణం పచ్చతోరణం లా 
నిత్య సత్యవ్రతం, ధర్మపాలన రెండు కళ్ళయ్యా అయోధ్య నగరికి 
కన్ను కుట్టిందయ్యా మంధరకు, ఊహు ... కాదయ్యా, నీ జన్మ 
అంతరార్ధానికి మార్గం వేసిందయ్యా, ఆ దేవతల దూత
రెచ్చగొట్టిందయ్యా కైకయిని, సాధించిందయ్యా రామా 
వరాల ముడుపులతో దశరధున్ని ఎదిరించి 
కానలకంపిందయ్యా రామా, కైకయి నీ కర్తవ్యానికి 
పునాది వేసిందయ్యా 
కళ్యాణ మండపంలో నీతో నడిచిన ఏడడుగులు 
చాలలేదయా మా తల్లికి, సీతమ్మకి 
ముళ్ళూ రాళ్ళలో కూడా నీతో కలసి అడుగులు 
వేసింది కదయ్యా!
నీపై బెంగ మహారాజుని మాలోకం నుండి 
తీసుకుపోయిందయ్యా, రామా రామ అంటూనే 
నేలకొరిగాడయ్యా నీ తండ్రి 

నీకు తెలియకనా రామా, సర్వాంతర్యామివి నువ్వు 
సమయం ఆసన్నమయిందయా రామా 
మాయజింకను మోహించి రావణునికి చిక్కిందయ్యా 
అమ్మ సీతమ్మ 
చిక్కిందయ్యా నీకోసం రోదిస్తూ 
నమ్మిందయ్యా నీరాక 
వచ్చాడయ్యా వాయుపుత్రుడు 
కట్టాడయ్యా వారధి నీకై 
చంపావయ్యా రావణుని 
చూశావా రామా! కట్టే కొట్టే తెచ్చే 
అయిపోయిందయ్యా నీకధ 
మాయసీతను అగ్నికిచ్చి 
అయోనిజను తెచ్చావయ్యా 

అంతా బాగుంది కానీ, రామా,
ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ ... నాతిచరామి 
ఇదే కదయ్యా అన్నావు ఆనాడు 
మరి నిండుచూలాలిని ఎందుకు విడిచిపెట్టావయ్యా 
అడవిలో -
నీరైపోతుందయ్యా నా మది ... 
 ఏమని చెప్పనయా నా బాధ ....

సూక్ష్మమెరగ నేనజ్ఞానినైతినయ్యా రామా .. 
తెలుపుమా దయయుంచి లోకాభిరామా.. .. 
 ఒక్క సీతమ్మకే పతివి కాదు
అయోధ్యకే పతివి (రాజువి)
ఒక్కరికోసం కాకుండా జనులందరి కోసం  నిర్ణయం తీసుకున్నావు కాబోలు రామా నిను తెలియ మా తరమా ... 
నీ హృదయం ముక్కలైన ప్రజలందరి క్షేమం కోరుకున్నావు 
అందుకే కదయ్యా నేటికీ 
నిత్యకళ్యాణం జరిపించుకుంటూ 
పుణ్యదంపతులంటే మీరేనని 
లోకమున ఆదర్శంగా నిలిచారు కదయ్యా, రామా ... 


phot

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం