పతివ్రతా ధర్మం, ధర్మవ్యాధుడు.


 మార్కండేయ  మహా ముని ద్వారా తన సందేహాలను తీర్చుకుంటున్న ధర్మరాజు పతివ్రతల ప్రసంగం తీసుకు వచ్చి ఇలా అడుగుతాడు..  "మహా మునీ, ఇంద్రియాలు సహజంగా గెలవరానివి. అలాంటి ఇంద్రియాలు జయించి, మనస్సు స్వాధీనంలో వుంచుకుని, అహంకారం విడిచి పెట్టి భర్త శూశ్రూష చేసే స్త్రీ సర్వ లోకాలలోనూ వుత్తమురాలని భావిస్తాను. పతివ్రతల  చరిత్ర దుర్లబ మైనది, ధర్మ సూక్ష్మాలు తెల్పేది కదా. అందు చేత పతివ్రతల ప్రభావం వినిపించండి”  అని  అడుగుతాడు..
మరియు, కుమాళ్ళ కోసం తల్లి, తండ్రి వుభయులూ ఆయాసపడతారు. ఐతే, వారి ఇద్దరిలోనూ ఎవరి ఆయాసం అధికం? తల్లిదండ్రుల విషయంలో కుమారుడు ఎలాంటివాడు కావాలి ? ఒకడు హీన యోనిలో పుడతాడు. వాడు పరమ ధార్మికులు పొందే లోకాలు పొందాలంటే ఎలా నడుచుకోవాలి ? దయచేసి సెలవివ్వండి  అని అడుగుతాడు..
అప్పుడు మార్కండేయుడు ఇలా చెప్పాడు..తొమ్మిది మాసాలు భద్రంగా గర్భం మోస్తుంది తల్లి.  ఎన్నో కష్టాలు సహిస్తుంది.   తుదకి ప్రాణం ఆటా, ఇటా   అన్న స్థితికి వచ్చి కుమారున్ని   కంటుంది. ఐతే, కొడుకు కోసం తపస్సులు, దానాలు చేస్తాడు తండ్రి. యజ్ఞాలు, యాగాలు , వ్రతాలు చేస్తాడు.దేవతల్ని, సాదువుల్నీ సేవిస్తాడు.. అందువల్ల, తల్లిదండ్రుల వుభయుల కష్టామూ ఒక్కటే అని తెలుస్తుంది . కొడుకు తమ మీద భక్తి   కలిగి వుండాలనీ, ధర్మార్ధాలు కోరేవాడుగా వుండాలని ఆశపడతారు తల్లిదండ్రులు.  వాళ్ళ ఆశ నిజం చేసేవాడే నిజమైన కుమారుడు . తల్లిదండ్రుల్ని అనుసరించి నడుచుకుని, వాళ్ళని సంతోష పరిచే కుమారుడు ధర్మమూ, కీర్తీ సాధిస్తాడు. చివరికి పుణ్య గతులూ పొందుతాడు",  అని కౌశిక ముని కధ చెప్తాడు మునీశ్వరుడు ..
కౌశికుడు అనే బ్రాహ్మడు ధర్మాత్ముడు, తపశ్శీలుడు .  ఎప్పుడూ వేదాధ్యయనం చేసేవాడు.  ఒకనాడు వూరి సమీపంలో ఒక చెట్టు క్రింద కూర్చుని, వేదాలు గుణించుకుంటున్నాడు.  సరిగ్గా అతని నెత్తిమీద ఒక కొక్కెర రెట్ట వేసింది..కోపంతో ఎర్రగా చూసాడు కౌశికుడు. అతను   అలా చూడగానే చచ్చి క్రింద పడిపోయింది ఆ కొంగ.  ఎంతో నొచ్చుకున్నాడు కౌశికుడు. అయ్యో, కటిక గుండె వాణ్ని ఐపోయాను", అని దుఃఖ పడ్డాడు. "నిష్కారణంగా కొంగని చంపేసాను. ఇంక నాకు శాంతి లేదు  అని ఎంతో విచారించాడు.  చివరికి లేచి నిత్యకృత్యాలు నిర్వర్తించుకుని ఊళ్లోకి వచ్చి శుచిమంతులైన బ్రాహ్మణ ఇళ్ళల్లో భిక్షం అడగడం   ప్రారంభించాడు.
ఒక ఇంటి వాకిట నిలబడి : భిక్షాందేహి అని కేకవేశాడు.   ఇంటి ఇల్లాలు ఆ కేక విని భిక్షం వెయ్యడానికి పాత్ర కోసం వెళ్ళింది.  ఇంతలో ఆమె భర్త బాగా ఆకలితో వచ్చాడు. భర్తని చూడగానే భిక్షం మాట ప్రక్కన పెట్టింది ఆమె. .   . .భర్తకి కాలు కడిగేందుకు నీళ్ళు ఇచ్చి స్నానం చేయించి, రుచికరమైన భోజనం పెట్టి,ఆతని భోజనం అయ్యాక భర్తకి చక్కగా పక్క పరచి ఆతను శరీరం వాల్చిన తర్వాత కాళ్ళు పట్టింది ఆమె. అతను హాయిగా నిద్రపోయాక, వాకిట్లో బ్రాహ్మడు భిక్ష కోసం నిలుచున్న  సంగతి తలచుకుంది.
అతవరకూ అలానే నిలుచున్నాడు కౌశికుడు. ఆమెను చూడడం తోనే మండి పడ్డాడు. వెంటనే  భిక్షం పెడితే నా దారిన నేనుపోయేవాడిని. ఇంతసేపు నిలబెట్టావు. దుర్మతివి. మదించి ఇంట చులకన చేసావు , అంటూ ఆమెని తిట్టడం మొదలు పెట్టాడు కౌశికుడు. నన్ను క్షమించు, నా భర్త ఆకలితో వచ్చాడు. ఆయన సేవలో వుండి  నీ విషయం ఆలోచించ లేకపోయాను..ఇది తప్పుగా భావించకు,  అని వినయంగా చెప్పింది ఆమె.   నీ మొగుడు ఎక్కువా, బ్రాహ్మడు ఎక్కువా ? బ్రాహ్మలంటే దేవుడు కూడా తల వంచుతాడు. అలాంటిది నీవు బ్రాహ్మలంటే గడ్డి  పోచలా చూస్తున్నావు అని బ్రాహ్మణునికి కోపం వస్తే ఏం జరుగుతుందో వివరిస్తాడు కౌశికుడు. బ్రాహ్మణునికి కోపం వస్తే, కొండలూ, నదులూ, వనాలు అన్నింటితోనూ భూ ప్రపంచాన్నే భస్మం చేసేస్తాడు ..అని కూడా చెప్తాడు.
ఆడదానిని, నా అపరాధం పట్టించుకోకు... అని బ్రతిమిలాడింది ఆమె.. బ్రాహ్మలు దేవతలతో సమానం. వారంటే నాకూ గౌరవముంది ..
ఐతే, కొంచెం శాంతంగా విను. నా భర్తే నాకు దైవం. మనసా, వాచా, కర్మణా ఆయన హితమే కోరి నేను నడుచుకుంటాను.. ఆయన సేవే నాకు పరమ ధర్మం. కనక ముందు నా ధర్మం నేను నిర్వర్తించాను. .నువ్వు కోపగొట్టు వాడివి అని నాకు తెలుసు.  నీ కోపం మూలాన ఒక కొంగ చనిపోయింది అని కూడా తెలుసు.  ఐతే, కోపం మంచిది కాదు అని గ్రహించాలి నువ్వు. కోపమూ,మొహమూ—ఈ రెండూ ఘోరమైన శత్రువులై మానవులను పీడిస్తూ వుంటాయి..వీటిని మనస్సులో అణుచుకోవాలి . సత్యం చెప్పిన వాడూ, హింస చెయ్యనివాడు, గురు జనుల హితం కోరేవాడూ, ఇంద్రియాలు స్వాధీనంలో వుంచుకునే వాడూ, యావన్మందినీ తనలాగే చూసుకునేవాడూ, ధర్మం తప్పని వాడూ, కామానికి వశం కానివాడూ, ఆరు కర్మలూ సముచితంగా ఆచరించేవాడు మాత్రమే బ్రాహ్మడు.. అలాంటి వాడిని   దేవతలూ కీర్తిస్తారు. ఆర్జవమూ, శామమూ, అధ్యయనమూ ఇవే బ్రాహ్మడికి పరమ దానం. అతడి ధర్మగతికి ఇవే సాధనం. ధర్మం అనేక విధాల సూక్ష్మంగా వుంటుంది. నువ్వు కేవలం సాధ్యాయ పరుడివి . వేదాలు వల్లించడం మాత్రమే చేస్తున్న వాడివి. అందుచేత ధర్మ సూక్ష్మాలు నీకు తెలియవు. నువ్వు బాగు పదాలని అనుకుంటే, నా మాట విను. మిధిలా నగరంలో ధర్మవ్యాధుడు అనే అతడు వున్నాడు. అతడు కిరాతుడు. జితేంద్రియుడు అతడు. సత్యవాది,. మాతా పితృ భక్తుడు. అతన్ని ఆశ్రయించు సకల ధర్మాలూ నీకు భోదిస్తాడు. నీ సంశయాలు యావత్తూ తీరుస్తాడు. నా మీద కోపం వదిలి పెట్టు. ప్రసన్నుడివి  కా .. ఆడ వాళ్లకి పరిజ్ఞానం తక్కువ కదా ..అందుకని ఆడది తప్పు చేసినప్పుడు క్షమించడం ధర్మం  అని చెప్పింది ఆమె.
వింటున్నంత సేపూ నివ్వెరపోయాడు బ్రాహ్మడు. ఆమె తెలివికి ఆశ్చర్య పోయాడు. తన తప్పు తెలుసుకున్నాడు. ఆమెకి కృతజ్ఞతలు  చెప్పుకుని మిధిలా నగరానికి బయలు దేరాడు..
మిధిలాపట్నం చేరుకున్నాడు కౌశికుడు.  రాజమార్గం ప్రవేశించి అక్కడి వాళ్ళని అడిగి ధర్మవ్యాధుని వునికి తెలుసుకున్నాడు.   ధర్మవ్యాధుడు బజార్లో కసాయి దుకాణం పెతూకున్నాదు..మాంసం విక్రయిస్తున్నాడు.  అసహ్యంగా వుంది అక్కడ.  కొంచెం దూరంగా వొదిగి నిలుచున్నాడు కౌశికుడు.  బ్రాహ్మడి రాక తెలిసి ఎదురు వచ్చి భక్తి పూర్వకంగా నమస్కారం చేసాడు  ధర్మవ్యాధుడు. కుశలం అడిగాడు..  తన వునికి తెలిపిన ఇల్లాలి పతివ్రతా లక్షణాలను పొగిడాడు. బ్రాహ్మడు తన దగ్గరకు ఎందుకు వచ్చాడో తెలుసును అని అన్నాడు. తన పని పూర్తీ కాగానే ఆ బ్రాహ్మణుని తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు ధర్మవ్యాధుడు.
చెప్పకుండానే తన సంగతిని తెలుసుకున్న ధర్మవ్యాధుని చూసి ఆశ్చర్య పోయాడు. రెండు వింతలు  చూసాను నేను.  మొదటిది ఆ ఇల్లాలి తెలివి, పాతివ్రత్యం, రెండవది ధర్మవ్యాధుని ఎరుక ..ఇలా ఆలోచిస్తూ ధర్మవ్యాధుని వెంట ఆతని ఇంటికి వెళ్ళాడు  ఆ బ్రాహ్మడు . ఇంటికి వెళ్ళాకా కౌశికున్ని గొప్పగా పూజించాడు ఆతడు. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతో ధర్మం తెలిసిన వాడివి. జీవ హింస జీవనంగా పెట్టుకున్నావు. ఘోరం. ఇది చూస్తూ వుంటే దుఖంగా వుంది నాకు. ఏం పని ఇది అని , అడిగాడు కౌశికుడు .
చిరునవ్వు నవ్వాడు. ధర్మవ్యాధుడు.
                                                                                            (  సశేషం )            

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం