శివోహం .........

 


శంకరుడు అంటే  సంతోషం  కలిగించువాడు  అని వేదాలలో వివరింపబడినది...   గాలి ఏ విధముగా వ్యాపిస్తున్నదో ఆ విధముగా వ్యాపించే శక్తి "శం"  అక్షరమునకు కలదు. " శం" నామము ఆనందముతో నిండినది.   ఏదైనా శివాలయమునకు మనం వెళ్ళినప్పుడు  శివ నామ ఘోష మన మనసులో ఆనందాన్ని నింపివేస్తుంది .  అదే పెద్ద నిదర్శనం . "శం" అనే పదానికి చిదానందం అని కూడా అర్ధమ్. "కర" అనగా అందించేవాడు లేక చేకూర్చువాడు అని అర్ధమ్. నిత్యానందమును , సచ్చిదానందమును అద్వైతానందమును అందించువాడు శంకరుడు .శంకరుడు  కైలాసవాసి ...
అర్ధనారీశ్వరుడు , వినాశాకారుడు, సృష్టికర్త ,శంకరుడు మూర్తి స్వరూపుడు ,  జటాజూటం , ఫాలభాగాన నెలవంక ,నుదుట  అగ్ని నేత్రం ,విభూతిదారణ ,రుద్రాక్షమాల , గజ చర్మదారుడు , త్రిశూలమ్, డమరుకం మొదలైన అలంకారాలతో ,ఆయుధాలతో విరాజిల్లుచున్నట్లు మనకు కనబడతాడు . అధర్వణ వేదంలో శివుని ఇలా స్తుతిస్తారు
"ముఖాయతే పశుపతే  యాని చక్శూంచి తే భవత్వచే రూపాయ సంద్రుశే ప్రతీ చీనాయతే నమః అంగభ్యస్త ఉదయరాయ జిహ్వాయ అస్సాయ తే దద్యో గందాయతే నమః"
దీని అర్ధం.. " ఓ పశుపతి; దేవా, శివా, మీ ముఖంనందున్న త్రినేత్రములకు , వక్త్ర రూపమునకు , మీ పృష్ట భాగ రూపమునకు మీ అంగ ములకూ , ఉదరమునకు ,జిహ్వ మొదలగు అవయవములకు అన్నింటికీ నమస్కారము " అని .
 ఇంతటి మహాదేవ రూపము కన్న లింగ రూపముకు మనం ఎందుకు ప్రాధాన్యం ఇచ్చామో అనే సందేహానికి లింగోద్భవ చరితే సమాధానం .. ఈ లింగోద్భవ చరిత్ర బ్రహ్మ ,విష్ణువులకు వారి వారి సృష్టి స్థితి అధికారాలు ఏ విధంగా సంక్రమించాయో కూడా తెలుపుతుంది.
లింగోద్భవ చరిత్ర. 
ఒకానొక సృష్టి ప్రారంబ సమయాన బ్రహ్మ దేవుడు తన ఐదు ముఖాలతో మహా విష్ణువు దగ్గరికి వచ్చాడు . ఆ సమయాన కమల నాభుడు దాసీజన ఉపచార్యలతో శేషపాన్పు మీద నిద్రించుచున్నాడు.  అహంకారపూరితుడైన బ్రహ్మ నారాయణునితో  "ఏమయ్యా ఇంతటి సృష్టికర్తను స్వయంగా వస్తే లెక్కజేయక నిద్రపోతున్నావా ? అందరికి తండ్రిని ,గురువును . నన్ను తగు విధంగా మర్యాద చేయి"  అనగా పద్మనాభుడికి కోపం వచ్చింది . తన నాభి నుండి ఉద్భవించిన తామరపువ్వు నుండి పుట్టిన  బ్రహ్మ  తనని అలా అనడం నచ్చలేదు . సృష్టి  కారకుడైన బ్రహ్మ తనని గురించి తాను ఇంకా ఇలా చెప్పుకోసాగాడు . "బ్రహ్మాన్డములన్నింటిని   సృష్టించిన స్రష్ట్ర ను నేను . నీవు కూడా నా సృష్టి లోని వాడవే " అని .
అంతట విష్ణుమూర్తి,  "సృష్టి ,స్థితి ,లయ కారణుడను. నేనే ఈ ప్రపంచానికి జగన్నాదుడను .ఈ సర్వమంతయూ నాది. నీవు కూడా నా ఆజ్ఞ ప్రకారమే నడుచుకోవాలి " అని అనెను . ఇద్దరిలో వాద ప్రతివాదాలు పెరిగి,  నేను గొప్ప అంటే నేను గొప్ప అను భావముతో వైరం పెరిగి అగాధంగా మారి యుద్దానికి దారితీసింది .  విష్ణువు మహేశ్వరాస్త్రాన్ని ప్రయోగించగా ,బ్రహ్మ పాశుపతాస్త్రాన్ని ప్రయోగించాడు . మహా ప్రళయం మొదలైంది..  దేవతలు , ఋషులు బయపడసాగారు..  వారిరువురకు బుద్ధిచెప్పే తలంపుతో వారిరువురి మధ్య పరమేశ్వరుడు జ్యోతిలింగముగా కోటివేల సూర్యకాంతులతో అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు.




 మహా విష్ణు ,బ్రహ్మల అస్త్రాలు ఆ అగ్నిస్తంభంలో విలీనం ఐపోయాయి . ఆది, అంతాలు తెలియకుండా వెలుగే వెలుగుగా వున్న ఆ నిలువెత్తు స్థంభం ని చూసి నివ్వెరపోయిన బ్రహ్మ ,విష్ణువుల తేజస్సు తగ్గిపోయి కలవరపడ్డారు . వారి అహంకారాలు తొలగిపొయాయి. ఈ తేజస్సు వారి సృష్టి కాదు. అవయవహీనంగా ,తుది మొదలు లేకుండా ప్రత్యక్షమైన ఆ తేజస్సు అంటూ తెలుసుకోవడానికి ఇరువురూ బయలుదేరారు . మొదలు తెలుసుకోవడం కోసమై విష్ణువు మహావరాహరూపంలో పాతాళాన్ని చీల్చుకుంటూ వెళ్ళసాగాడు . తుది కనుక్కోవడం కోసం బ్రహ్మదేవుడు హంస రూపంలో ఊ ర్ధ్వానికి సాగాడు . ఎంతదూరం భూమిని తొలచుకుంటూ పోతున్నా  జ్వాలాస్థంభం మొదలు దొరకనందున అలసిపోయిన నారాయణుడు యుద్ద స్థలానికి చేరుకున్నాడు . బ్రహ్మ కూడా ఎంత పైకి వెళ్ళినా తుది  గోచరించలేదు . అదే సమయానికి శివత్తెజస్త స్తంభాగ్రం నుండి  మొగలిపువ్వు క్రిందకు పడిపోతూ వస్తుంది . "ఆ స్థంభం యొక్క అగ్రం తెలుసా నీకు?"  అన్న  బ్రహ్మ ప్రశ్నకు మొగలిపువ్వు "కాలమానం ప్రకారం చెప్పాలంటే నేను   స్థంభం యొక్క శిఖరాగ్రం నుండి జారి ఇప్పటికి ఇక్కడికి చేరాను . ఈ లోపల స్థంభం ఎంత పెరిగి వుంటుందో తెలియదు. దీని అగ్రాన్ని చూడడం నీవల్ల కాదు"  అని చెప్పింది . ఓడిపోవడం నచ్చని బ్రహ్మ ఆ మొగలిపువ్వుని తనకి ఒక ఉపకారం చేయమని అడిగాడు . " విష్ణువు దగ్గరికి వెళ్లి స్థంభ శిఖరాగ్రం చూసానని చెప్తాను . నామాట నిజమని నీవు సాక్ష్యం చెప్పాలి"  అని ప్రాధేయపడ్డాడు . మొగలిపువ్వు సరేనని ఒప్పుకున్నది .. దిగాలుగా కూర్చుని వున్న మహా విష్ణువు దగ్గరికి వెళ్లి స్థంభం పైభాగం చూశానని చెప్పాడు బ్రహ్మ .  నిజమే   అన్నది మొగలిపువ్వు. నాకన్నా నీవే గొప్ప అని బ్రహ్మ ఆధిక్యత ఒప్పుకున్నందువల్ల విష్ణువు యొక్క అహంకారం నశించింది. అతనిని కమ్మి  ఉన్న మాయ తొలగిపోయింది .తన ప్రవర్తనకు పశ్చాత్తాపపడ్డాడు . చిత్తంలో శివ నామం తలచాడు . బ్రహ్మని   శిక్షింప నిశ్చయించిన శివుడు విష్ణుని పశ్చాత్తాపానికి , శివ చింతనకి ప్రసన్నుడై స్వచ్చమైన మూర్తిత్వంతో ప్రత్యక్షమైనాడు .. "నారాయణా ,కమలనయనా :  నీ యొక్క సత్య ప్రవర్తన నన్ను సంతుష్టపరచింది  ఎవడు సత్యాన్ని ఆశ్రయిస్తాడో వాడే శాశ్వతుడు . ఇప్పటినుండి వూర్ధ్వ ,మధ్యమ అధో  లోకాలు అన్నింటా నాతొ సమానంగా పూజింప బడతావు .నాకన్నా నీకు  ఎక్కువ క్షేత్రాలు ఏర్పడతాయి . పూజలు ,ఉత్సవాలలో లౌకిక జగత్తులో నాయంతటివాడివిగా ఆరాధింప బడతావు"  అని వరాలు అనుగ్రహిస్తాడు . అసత్యపు మాటలు  చెప్పిన బ్రహ్మను కోపించి పరమేశ్వరుడు భైరవుడిని సృష్టించాడు . జగతికి తొలివేల్పు అని కూడా తలంచక బ్రహ్మకి  గుణపాఠం చెప్పమనగా భైరవుడు బ్రహ్మ యొక్క ఐదవ శిరస్సును నరికి వేయగా గడగడ బ్రహ్మ శివుని పాదాలపై పడి   క్షమించమని    ప్రార్ధింపగా సృష్టి కార్యక్రమంలో వున్నప్పటికీ  పూజార్హుడువు కావు అని శివుడు ఒక వరం అనుగ్రహిస్తాడు . "యజ్ఞ యాగాదులు మొదలైన  క్రతువులందు నువ్వే బ్రహ్మగా, గురువుగా గౌరవింప బడతావు " అని . అసత్యపు సాక్ష్యం చెప్పిన మొగలిపువ్వుకి తన ఆరాధనలో స్థానం లేకుండా శాపం ఇచ్చాడు ఆ పరమేశ్వరుడు . దుఖం తో ప్రాధేయపడిన మొగలిపువ్వుకి, "నా ఆరాధనా నిషిద్ద మైనప్పటికీ  నాకు పై కప్పుగా అలంకరింప వినియోగితురాలివి కాబడతావు" అని  వరమిచ్చాడు శివుడు . ఆ జ్వాలా లింగ మహోగ్ర తేజాన్ని తేరి చూడలేని దేవతలు , ఋషులు ప్రార్ధింపగా పరమేశ్వరుడు పార్ధీవ లింగ రూపాన పృధివి న ఆవిర్భవించాడు శివుడు  .   మాఘ మాసం లోని కృష్ణ పక్ష చతుర్ధశి నాడు లింగోద్భవం జరిగింది . ఈ సకల చరాచర లోకాలు ఎందులో లీనమై  ఎక్కడి నుండి పుడతాయో , జగత్తులన్నింటికి మూలమైనదో అదే శివలింగం .  సంపూర్ణమైనది ,  అఖండమైనది , సకల జగత్సాధానం , ఏకం చిన్మయం , శ్రీకరం, శ్రిత సేవితం , జ్యోతిరూపం జ్యోతిరూపం .        


శ్రీ నీల కంఠం భుజగేంద్ర భూషం  నాగాజినం రాజకళాకలాపం !
గౌరీశ్వరం దేవా మునీంద్ర సేవ్యం  దేవంభజే శ్రీ గిరిరాజ నాధమ్ !!  

"శోభాకరమైన నీల కంఠం కలిగి ,శ్రేష్టమైన సర్పాలను  ధరించిన గజ చర్మ ధరుడును ,చంద్రకళా భూషణుడు , పార్వతీ పతిని, నారదాది మునులు సేవించే కైలాస పతి ఐన పరమేశ్వరుని నేను భజించెదను "





































కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం