Content

Wednesday, January 23, 2013
ఇక సుఫల స్నేహం గురించి .........శ్రీ కృష్ణుడు మరియు కుచేలుడు మధ్య గల స్నేహ  సంబంధం అందరికీ తెలిసినదే... అతి బీద బ్రాహ్మణుడు  కుచేలుడు తప్పని సరియై మిత్రుని వద్దకు వెళ్ళ  వలసి వచ్చినప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళలేక   అటుకులను  తీసుకుని  బయలు దేరాడు..తన చిన్ననాటి స్నేహితుని  తన దగ్గరకు తీసుకుని ఎంతో   ప్రేమతో   ఆదరించి కుచేలుడు సమర్పించిన అటుకులను ప్రీతిగా ఆరగిస్తూ , నోరు తెరచి సహాయం అడగ కుండానే విషయాన్ని  గ్రహించిన   ఆ పరంధాముడు    కుచేలుని ఇంటిని సర్వైశ్వర్యాలతో నింపిన విషయం  మనకు తెలిసినదే.. అడగనిదే అమ్మైనా పెట్టదు  అన్న సామెతకు  ఇక్కడ చోటు లేదు. అడగకుండానే తన మిత్రుని పరిస్థితి గ్రహించి అన్ని వరాలను ఇచ్చిన ఆ పరమాత్మది సఫల స్నేహమే కదా .
ఇక నర నారాయణు లైన   కృష్ణార్జునుల స్నేహం సుఫలమా  అన్నది పరిశీలిస్తే , అర్జునునికి ద్రౌపది , వులూచి ,చిత్రాంగద అన్న భార్యలు వున్నప్పటికీ ఆతని మీద నమ్మకంతో తన చెల్లెలు సుభద్ర ను ఇచ్చి  పెళ్లి చేసాడు ..
యుద్ద భూమిలో రక్త సంబంధీకుల ను చూసి విచలితుడైన అర్జునునికి   తన విశ్వరూపం చూపించి, మరీ గీత  భోదించాడు.. సత్యం ఏమిటో తెలియజేశాడు.. అదీ  మంచి మిత్రుని లక్షణం అందువల్ల శ్రీ కృష్ణార్జునుల స్నేహం సుఫల  స్నేహం గా  చెప్పబడింది.. 
సీతాన్వేషణలో శ్రీ  రామచంద్రుడు లక్ష్మణ సహితుడై  కిష్కింద వెళ్ళినప్పుడు  సుగ్రీవుడు రాముని తన స్నేహితుడిగా స్వీకరించి తన అన్న వాలిని గురించి చెప్పినప్పుడు రాముడు వాగ్దానం చేస్తాడు అతని  రాజ్యమును  మరియు అతని భార్యను    అతని అన్న నుండి   సుగ్రీవునికి ఒప్పగించుతానని , అందుకు అవసరమైతే వాలిని సంహరించాల్సి వస్తే అందుకు వెనుకాడనని ...  సుగ్రీవునితో స్నేహం కోసం అన్న మాట నిలబెట్టుకున్న రాముని కధ   తెలిసినదే ..
  పై ఘటనలు  అన్నీ ద్వాపర త్రేతా యుగాలలో జరిగినా ధర్మం నాలుగు  కాళ్ళ మీద  , మూడు కాళ్ళ మీద  రెండు కాళ్ళ మీద నడిచినా స్నేహ ధర్మం మాత్రం మారలేదు ...
కానీ ఈనాటి కలియుగంలో మాత్రం ధర్మం  ఒంటి కాలి మీద కుంటుతూ నడుస్తుంది అని చెప్పినట్లే స్నేహధర్మం కూడా అర్ధం లేని రీతిలో ఎటు నడుస్తుందో చెప్పలేని స్థితిలో వున్నాము అనడంలో ఏమాత్రం సందేహం లేదు ....
చిన్నా , పెద్దా, ఆడా ,మగా , ప్రతీ ఒక్కరూ స్నేహం పేరుతొ తప్పు దారి పడుతున్నారు ... పట్టిస్తున్నారు ... స్నేహం    మనసుకి సంబంధించినది .. మనసు  అదుపు లో లేని స్నేహాలు పెడ త్రోవ పడుతున్నాయి.. తెలిసి తెలియని అజ్ఞానం మనసుని క్రమ్మి వేస్తుంది ..ఫలితం ఈనాడు  ప్రతిరోజూ మనం న్యూస్ పేపర్ లో  చూస్తున్నాము...  మనసుకి బుద్ధి ని జత చేస్తే  ఎలాంటి చెడు ఫలితాలు వుండవు . సమాజం బాగుంటుంది . ఆనందంగా వుంటుంది. (సమాజం   అంటే మనమే అన్న సంగతి మరచి పోతున్నాము )...
మనసున మనసై బ్రతుకున బ్రతుకై అన్న పాట వినడానికి ఎంత బాగుంటుందో , ఆచరణలో పెడితే అంత  అందంగానూ వుంటుంది   అనడంలో ఎ మాత్రం సందేహం లేదు. చివరగా ఒక్క మాట ...........

ఎవరి సన్నిధిలో మనసు మూగబోతుందో,  సన్నిధి అలౌకిక స్థితికి చేర్చి ప్రశాంతత ను అనుభవింపజేస్తుందో, ఎవరి సన్నిధి  పరమాత్మ దర్శనం గావిస్తుందో అదే నిజమైన స్నేహం ..ఆ స్నేహం తల్లితో కావచ్చు ,తండ్రితో కావచ్చు ,సోదరులతో కావచ్చు, భాగస్వామితో  కావచ్చు, తోటివారితో కావచ్చు  లేదా సాక్షాత్ ఆ భగవంతునితో కావచ్చు 
 అనుభవించినవారికి తెలుస్తుంది నిజమైన స్నేహం ఏమిటో.. 
స్నేహం మనసుకి సంబంధించినది అని  ముందే చెప్పాను. అలానే కామం (కోరిక ) శరీరానికి సంబంధించినది .. రెండింటినీ కలిపి స్నేహం అన్న  పదానికి అర్ధం మార్చేస్తున్నారు ఈనాటి తరం..  యుగాన్ని బట్టి ధర్మం మారుతుంది అన్నారు  పెద్దలు .. స్నేహం కూడా ఒక ధర్మమే కాబట్టి దాన్ని కూడా మార్చేస్తున్నారు ... 
స్నేహం  పసిపాప  వంటిది. గారాబం తో పాడు చేయకుండా అదుపులో వుంచుతూ  పెంచుకోవలసినది .. స్నేహం పాల వంటిది .. జాగ్రత్తగా చూసుకోకుండా వుంటే పొంగిపోయే లేదా విరిగి పోయే అవకాశం వుంటుంది ..     


© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

0 వ్యాఖ్యలు:

Post a Comment