కుల ధర్మం

"  నువ్వు పొరబడుతున్నావు. బ్రాహ్మలకి తపస్సూ అధ్యయనమూ బ్రహ్మచర్యము పరమ ధర్మం రాజులకు దండ నీతీ  ,  వైశ్యులకు కృషి, పశువులు  పాలించడమూ,  వర్తకమూ , శూద్రులకి బ్రాహ్మణ శూశ్రూషా ఎలాగో  అదే విధంగా మాకూ మాంసం  అమ్ముకు బ్రతకడం  పరమ ధర్మం. వంశాను క్రమంగా వస్తున్న  కుల  వృత్తిని విడిచి పెట్టకూడదని నీకు తెలియనిదా ? ఈ దేశం రాజు .జనకుడు   ధర్మం తప్పని వాడు . సకల వర్ణాల వారిని రక్షిస్తూ ఉంటాడు. తమ వర్ణాచారం విడిచిన వాళ్ళని తన వాళ్ళు అని కూడా చూడడు.  కఠినం గా దండిస్తాడు.
మాంసాన్ని అమ్ముకుని బ్రతుకుతున్నా నేను  జీవ  చేయను. పై వాళ్ళు చంపి తెస్తారు. నేను తగిన వెలకే అమ్ముతాను.   అయినా ఆ  ధనం  తో నాకు పని లేదు.  మనశ్శాంతే    నాకు ధనం. గురు జనుల సేవ  చేస్తాను. వృద్ధులూ, అతిధులు , బ్రాహ్మలూ, దేవతలు-- వీరందరినీ పూజిస్తాను సత్యమూ, శౌచము ,దానము మరచిపోను.   సేవకుల పట్ల, బంధువుల పట్ల  ఓర్పు చూపిస్తాను. అసూయ ,దురాశ లను , మనసుకి  అంటనీయను. పర నింద  చెవుల పడనీయను.   ఏక పత్నీ వ్రతం విడిచిపెట్టను . నిందా, స్తుతీ  ఒక్క లాగే భావిస్తాను. కనుకనే తక్కువ కులంలో పుట్టినా పవిత్రుణ్నే  అయ్యాను. తప్పనిసరియై ఇదంతా చెప్పవలసి వచ్చింది.  నా దగ్గర ఏదో వినాలని వచ్చావు నువ్వు. అందు వల్ల  ధర్మ విశేషాలు నాలుగు   విను ", అని   ధర్మవ్యాధుడు ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.
"కుల ధర్మం తప్పకుండా  బ్రతకడమే ఉత్తమ ధర్మం అంటారు పెద్దలు.  దయ, ఓర్పు . అవసరం. విషయ వాంచలు మానుకోవాలి. త్యాగానికి మించిన ధనం (గుణం ) లేదు.  ఇతరులకు మంచి కలిగించే మాటలాడాలి.   సజ్జనుల్ని పూజించాలి . క్రోధం వల్ల ,  విద్వేషం వల్ల మతి చలిస్తుంది, అయినా ధర్మం తప్పకూడదు. మంచీ, చెడ్డా , సుఖమూ , దు:ఖమూ--- దేనికీ లొంగ కూడదు.  ధార్మికులు పని చేస్తుంటే చెడగొట్టాలని చూస్తారు నాస్తికులు. వాళ్ళను చూసి ధర్మం మీద ఆసక్తి విడిచి పెట్టకూడదు. పొరబాటున  ఏదైనా పాపం చేస్తే,పశ్చాత్తాపం వల్ల సగం, 'మరి ఎప్పుడూ చేయను' అన్న సంకల్పం   వల్ల  సగం  ఆ పాపాన్ని వొదుల్చుకోవచ్చు. క్రోధమూ, లోభమూ-- ఈ  రెండింటిని మించిన పాపాలు లేవు ఈ లోకంలో . ఈ రెండూ జయించిన వాడే ధార్మికుడు అనిపించుకుంటాడు.
ధర్మ విషయం లో శిష్టాచారమే ప్రమాణంగా తీసుకోవాలి.  శిష్టాచారానికి దూరంగా  కొన్ని మార్గాలు   గడ్డితో కప్పి వున్న నూతుల్లాగా కపట ధర్మాలతో ఆవరించి వుంటాయి. వాటికి మనం దూరంగా వుండాలి."
ధర్మవ్యాధుడి ఉపదేశం  విన్నాడు కౌశికుడు. " శిష్టాచారం అంటే ఏమిటి ?"---- తెలుపమన్నాడు.
 చెప్పడం మొదలు పెట్టాడు ధర్మవ్యాధుడు--" శిష్టులు అంటే ఉత్తములు. వారు ఆచరించే   దానమూ, తపమూ, సత్యమూ --శిష్టాచారాలు. కామ, క్రోధ,లోభ విడిచి పెట్టడం,   దాంభికత్వమూ, ధైన్యమూ, అసూయాహంకారములు లేకుండా వుండడం , శీలవంతులై వుండడం , తీర్ధ యాత్రలు చేయడం, శుచిగా వుండడం, జీవులన్నింటి మీదా దయ కలిగి వుండడం, మితంగా, హితం గా   మాట్లాడడం ..............ఇవన్నీ శిష్టాచారాలు. నువ్వూ శిష్టాచారుడి వై నడుచుకో . గురు శూశ్రూషా, వేదాధ్యయనం చేయి. చిత్తం పరిపక్వం చేసుకో.  మోహం ఒక మహానది. విషయాలే దానికి నీళ్ళు. కామమూ , క్రోధమూ-- పెద్ద,పెద్ద మొసళ్ళు.  చలించని  ధైర్యం తో ఈ  మహా నదిని దాటు. శిష్టాచారం పట్టు బడిందా , హృదయం ధర్మానికి ఉనికి పట్టు అవుతుంది .సత్యమూ, అహింసా అవే అలవడతాయి.
ధర్మాలన్నింటిలోకి రాజు అహింస. అది సత్యం మీద ఆధార పడి  వుంటుంది. అన్ని ఆచారాల్లోకి సత్యం గొప్పది.
వేదాల్లో చెప్పింది, శాస్త్రాల్లో వివరించింది శిష్టజనులు ఆచరించింది -----ఇలా ధర్మం మూడు విధములు. ఈ మూడు విధాల ధర్మాలు మనుష్యుల సద్గతికి కారణాలు. 
ఎప్పుడూ శమవంతుడై , శిష్టాచారం ప్రకారం నడుచుకునే పుణ్యాత్ముడు దుర్గతుల నుండి దాటిపోతాడు . 
మోహ పంకంలో మునగడు. దు:ఖం అనుభవించే లోకం చూస్తూ తానూ మాత్రం నవ్వుతూ వుంటాడు 
మొట్ట మొదట నా ప్రవర్తన   చూసి 'ఇది హింసా మార్గం' అన్నావు  కదా.                              
హింస ఇలా వుంటుంది అని విడమర్చి చెప్పడం   సులభం కాదు. ఎందుకంటే, పూర్వ జన్మల  వల్లనే ప్రాణులు నశిస్తాయి చంపేవాడు కేవలం నిమిత్త మాత్రుడు అవుతాడు మహా పురుషులు ఇదే చెప్పారు '  పళ్ళు , దుంపలూ
మొదలైనవి పశువులకి ఆహారంగా నియమించాడు బ్రహ్మ.' అంటున్నాయి వేదాలు శిబి చక్రవర్తి తన శరీరం కోసి ఇంద్రుడికి, అగ్నికి మాంసం పెట్టాడు. అది హింసే కదా. కాని అతడికి ఉత్తమ గతి  కదా. రంతి దేవుడు  వెయ్యి   సంవత్సరాల కాలంలో ప్రతిరోజూ రెండు  ఆవులు చొప్పున వధించాడు.  మరి అతడికి పాపం చుట్టుకోలేదు. వేదార్దాల మీద ఆసక్తి గల పురుషులు  యజ్ఞాలలో పశువులను చంపుతున్నారు . వాళ్లకి పుణ్యలోకాలు  లేకుండా పోయాయా ?  అగ్నులు అధికంగా మాంసాన్ని  కాంక్షిస్తాయని   వేదాలలో లేదా ? పితృ దేవతలా కార్యాలలో మాంసం పెట్టాలని , ఆ శేషం భుజించాలని మునులే  చెప్పారు కదా.              
       వ్యవసాయదారుడు  నాగలితో దున్నేటపుడు   ఆ నాగలి  మొనలో ఎన్నో ప్రాణులు చస్తున్నాయి. అది హింస అంటామా ?  మనుష్యులు నడిచేటపుడు వారి పాదాల క్రింద ఎన్ని ప్రాణాలు నలిగి చస్తున్నాయో మనకు తెలుసా?
 ఇవన్నీ కావాలని చేసేవి కాదు కదా.... నీరూ, నేలా, ఆకాశమూ --- అంతా ప్రాణులతో  నిండి వుంది. అందుచేత  ఏది చేసినా  హింస తప్పదు హింస లేకుండా దేహ యాత్ర సాగాడు ఇది అంతా ఆలోచించ కుండా 'నేను జీవ హింస  చేయడం లేదు'  అన్న భావనతో తృప్తి పడుతుంటారు కొందరు.  నిజం విచారిస్తే ప్రపంచంలో హింస చేయని వాడు అంటూ ఎవడూ లేడు .
ధర్మం అనేక  వుంటుంది. ధర్మ సూక్షం గ్రహించడం అంత సులువు కాదు. వేద ప్రమాణం మీద, పెద్దల నడవడిని బట్టి అది తెలుసుకోవాలి. ప్రాణుల  మేలు కోసం అసత్యం చెప్పినా అది సత్యమే అవుతుంది.. పుణ్యమే కలుగుతుంది .
సత్యం చెప్పడం వల్ల ఉపద్రవం   కలిగితే అది సత్యం కాదు. పాపం వస్తుంది.... చెడ్డదే  కుల ధర్మం వదలరాదు అన్నారు ధర్మవేత్తలు .

పూర్వ కర్మ ఫలం తప్పించు కోవడం ఎవరి వల్లా కాదు.
 మూడుడు అది గ్రహించడు .
 ఆపద వచ్చినప్పుడు దేవుణ్ణి తిడతారు.        ఒక పని చేసినపుడు దాని ఫలానికితానే  కర్త   అని భ్రమిస్తాడు  . తానే  కర్త  ఐతే, ఏ పనీ   చెడకుండా చెయ్యాలి కదా.   కొందరు ఏ శ్రమా  చేయకపోయినా డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. కొందరికి ఎంత ఆయాస పడినా దమ్మిడీ అయినా దొరకదు.  పేదవాడికి సంతానం ఎక్కువ.  ధనవంతుడికి  ఎన్ని దాన ధర్మాలు, వ్రతాలు చేసినా సంతానం  వుండదు. ఇదంతా వారి వారి కర్మఫలం  . కర్మ వల్లే దేహం కలుగుతుంది.  కర్మ వల్లే  బ్రతుకుతుంది.
దేహం  పడిపోయాక , దేహంలో వుండే జీవుడు దేహాన్ని వదిలి  కర్మానుసారంగా ఇంకో చోటికి వెళ్ళిపోతాడు ."

  జీవుని విషయం చెప్పగానే " జీవుడు ఎటువంటివాడు"  అని అడుగుతాడు కౌశికుడు.
"జీవుడు  సనాతనుడు. పవిత్రుడు . నిజ కర్మ వల్ల  అశాశ్వతమైన దేహంలో ప్రవేశిస్తాడు. దేహం నశిస్తుంది . అంతమాత్రాన జీవుడు నశించడు .  ఒక దేహం వదిలిపెట్టి ,ఇంకో దేహంలో ప్రవేశిస్తాడు. కర్మానుసారంగా సుఖమో దుఖమో అనుభవిస్తాడు.   జీవుడికి మళ్ళి ,మళ్ళి దేహ బంధం కలుగుతూనే  వుంటుంది.  ఐతే,  ఈ  దేహబంధం తానూ చేసిన పుణ్య పాపాలను అనుసరించి వుంటుంది.  
స్థిరమైన పుణ్య కర్మ చేస్తే---- దేవత్వం కలుగుతుంది.
పుణ్య కర్మ , పాప కర్మ  కలిపి   చేస్తే--- మనిషి జన్మ కలుగుతుంది.   
 కేవలం పాపమే చేస్తే-- పశువు జన్మో ,  పురుగు  జన్మో   కలుగుతుంది.
ఇలా అనేక యోనుల్లో పుడుతూ ,చస్తూ మోహ సముద్రంలో కొట్టుకు పోతూ  ఉంటాడు, కాని  ఒడ్డు చేరడం అంటూ వుండదు.

ఇది తెలుసుకున్న వాడు పాపం జోలికి వెళ్ళడు . మదము , అహంకారము , మచ్చరములను దగ్గరకు చేరనీయడు.  ధర్మ మార్గంలోనే నడుస్తాడు. ఇంద్రియార్ధాలు అంటే శబ్దమూ, స్పర్శ మొదలైనవి మాయ అని తెలుస్తుంది. వాటిని వదిలి పెడతాడు. తపస్సూ, దమమూ, సత్య శీలమూ --వీటిలో పరిణితి చెందుతాడు చివరకు ముక్తుడై 
పరమ పదం చేరతాడు ." అని  బోధిస్తాడు ధర్మ వ్యాధుడు ;

 ఇంద్రియాలు అంటే ఏవి ?  వాటిని నిగ్రహించక పొతే పాపం  ఎలా వస్తుంది ? నిగ్రహించిన వాడికి ఏమి సిద్ధిస్తుంది ? అని మళ్ళీ అడిగాడు కౌశికుడు.   
   
  కుల ధర్మం

                                                                                                            (సశేషం)

  


                           

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం