ఏది ధర్మం ?

ఏది ధర్మం ? ఈ ప్రశ్న అందరి మనస్సులో ప్రతి నిత్యం మెదులుతున్నదే.. తెలుసుకోవాలన్న కుతూహలమూ వుంది ..అందుకే నా యీ చిన్ని ప్రయత్నం నాకు మేలు చేయడమే గాక, నాలాంటి  ఇతరులకు కూడా సహాయ పడుతుంది అని ఆశిస్తూ .. అసలు
ధర్మం అంటే ఏమిటి ?
ఈ ప్రశ్నకు సమాధానం నలుగురూ నాలుగు రీతుల్లో ఎవరికి తెలిసింది లేదా తోచింది  వారు చెప్పవచ్చు.ఐతే ధర్మం శాస్త్ర పరమైనదా ,మనకు  మనం సృష్టించు కున్నదా ?
ధర్మం అంటే ఏమిటి అన్న   ప్రశ్నకు సమాధానం చాలా  క్లిష్టమైనది . ఈ పదం చాలా  నిగూడత కలిగినది ..చాలా లోతు గలది  విశాలమైనది.
                                         ధర్మంతు  సాక్షాత్ భగవత్ ప్రణీతం
ధర్మములు అన్నియు సాక్షాత్ పరమాత్మ నుండి నుండి లభించాయి --- బ్రహ్మశ్రీ గుత్తికొండ వెంకటేశ్వర  రావు గారు.
ధర్మం ఏ యుగంలో అయినా ఒక్క లాగే వుంటుందా ?
వుండదు.. దేశ ,కాల, ప్రాంతాల స్థితిని బట్టి   మారుతూ వుంటుంది..

       దృతి: క్షమా దమం అస్తేయం శౌచమింద్రియ  నిగ్రహం 
        హ్రీర్విద్యో  సత్య మక్రోధం ఏతత్ ధర్మస్య లక్షణం ...  
దృతి, క్షమ, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియనిగ్రహం, హ్రీ: (సిగ్గు ),విద్య, సత్యం, అ క్రోధం ,....ఈ పది లక్షణాలు కలిగినది ధర్మం అని శాస్త్రం తెలుపుతుంది ...
శర్మ గారు మరల ఇలా అన్నారు ..
హిందూ మతం ఆచారాల పుట్ట. 
కులాల గుట్ట.
ఒక్కో కులానికి ఒకో  ఆచారం, ఒక్కో ఆచారానికి ఒక్కో శాస్త్రం.

మన పూర్వీకులు శాస్త్రాలను, ఆచారాలను, ఆనవాయితీలను గ్రుడ్డిగా గంగిరేద్దుల్లా లేదా గానుగేద్దుల్లా ఆచరించలేదు .
ప్రతి ఆచారం  వెనుక ఒక శాస్త్రీయ కారణం వుంది అని చెప్తున్నారు .
అలానే ప్రతి ధర్మం వెనుక ఒక కారణం వుంది .
 • ప్రారంభించిన పనిలో ఏ  సమస్యలు వచ్చినా, అడ్డంకులు ఏర్పడినా, ఆత్మ బలంతో,aakunthita దీక్షతో ముందుకు సాగిపోవడం ధర్మం.
 • ఓర్పు కలిగి వుండాలి. క్షమా గుణం కలిగి వుండాలి.  ఇది ధర్మం. 
 •  ఏ  పని చేస్తున్నా ఆ పని యందే  మనసు లగ్నం కావాలి . ఇది ధర్మం .
 • తెలియని విషయాలను నేర్చుకోవాలి. పెద్దల ఎడ గౌరవం తో తెలుసుకున్న వాటిని పాటించాలి. నియమంతో వుండాలి .స్వతంత్రుడై వుండాలి .ఇది ధర్మం .
 • మనసా, వాచా, కర్మణా మనం చేసే పనులు తానొవ్వక, ఇతరులను నొప్పింపక మనసు, శరీరం, మాట, ఆలోచన పరిశుభ్రంగా  వుండాలి .ఇది ధర్మం .
 •  మనస్సు మన చేతుల్లో వుండాలి.ఇంద్రియ నిగ్రహం కావాలి .దృష్టిని, శరీరాన్ని, మనసుని, మాటని, చేతలను, మన అదుపులో వుంచుకోవాలి .ఇది ధర్మం .
 • సత్యవ్రతం కలిగి వుండాలి. ఇతరులకు సహాయ పడే విషయంలో తప్ప మన స్వప్రయోజనాలకై ఏనాడూ అసత్యం ఆడకూడదు.ఇది ధర్మం.
 • ఆహారం ముఖ్యం. వివేకం ఇంకా ముఖ్యం. వివేకం కావాలంటే,విద్య కావాలి.శాస్త్రాలు పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధించదు. స్వానుభవంతో కూడిన వివేకం కావాలి.వివేకవంతుడిగా మనగలగాలి. ఇది ధర్మం.
 • కోపాన్ని జయించితే, మన చుట్టూ వున్నవారిని రక్షించ గలుగుతాము. ఓరిమి కలిగితే, ఇతరులకు సహాయ పడగలము. 
పైవన్నీ విశేష ధర్మాలుగా పేర్కొనడం జరిగింది .
ఇక సామాన్య ధర్మాల విషయానికి వస్తే, అవి శాస్త్ర పరమైనవి కానక్కరలేదు.
గురు ధర్మం, శిష్య ధర్మం, యజమాని ధర్మం, ఇల్లాలి ధర్మం, పుత్ర ధర్మం, తండ్రి ధర్మం, తల్లి ధర్మం,సంసార ధర్మం, వృత్తి ధర్మం, సత్యధర్మం, వివాహ ధర్మం, భర్త ధర్మం,భార్య ధర్మం, మిత్ర ధర్మం, పురుష ధర్మం (సోమరితనం లేకుండా వుండడం), దాన ధర్మం .ఇవన్నీ సామాన్య ధర్మాలు .అవి మనకు తెలిసినవే.
చివరిదైన దాన ధర్మం విషయానికి వస్తే, పూర్వం ఇది ఒక కర్తవ్యమ్ లా వుండేది. గుప్తం గా వుండేది..పదిమందికి వుపయోగ పడేది గా వుండేది .
ఇప్పుడు వ్యక్తివైభవ చిహ్నంగా మారింది.
ఆ కాలంలో భ్రాహ్మణ వర్గం వారికి వున్న ఇల్లు తప్ప స్థిరాస్తులు వుండేవి కావు. వారు విద్యార్జన చేసి, ఆ విద్యనూ పలువురికి వుచితంగా భోధించేవారు ..   శిష్యులు, భ్రాహ్మణ బ్రహ్మచారులు ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేసి వచ్చిన దానిని గురువు గారికి సమర్పించే వారు .
ఆనాడు విద్య నేర్పినందుకు  గురువు ప్రతిఫలం ఆశించెవారు కాదు.
ద్రోణుడు ఏకలవ్యుని వద్ద గురుదక్షిణ  అడగడానికి కారణం ప్రియ శిష్యుడు అర్జునుని మించిన వాడుగా ఏకలవ్యుడు విలు విద్యలో రాణించడం.. .అర్జునుని విలు విద్యలో అందరికన్నా మేటిగా తయారు చేస్తానన్న మాట  కోసం .
అది గురు ధర్మం. ఇచ్చిన మాట తప్పకపోవడం.
అప్పట్లో వైద్యం (ఆయుర్వేదం) వుచితంగా దొరికేది.
విద్య,  వైద్యం, వేదం, జ్ఞానం, ఎవరూ ఎవరికీ అమ్ముకోకూదనివి .ఎవరూ కొనుక్కోలేనివి..
కాని ఈనాడు అవి అన్నీ జరుగుతున్నాయి ..
                                                ధర్మో రక్షతి రక్షిత :
                                 ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మం మనలను రక్షిస్తుంది .
ఇవి పేపర్ల  మీద కాదు. ఆచరణలో కనబడాలి.
ధర్మాన్ని నమ్మాలి . ఆచరించాలి. ధర్మాన్ని ఆశ్రయించాలి. ధర్మ మార్గాన నడవాలి. ధర్మాన్ని గౌరవించాలి.
ప్రభు ధర్మం కోసం  తన ప్రియాతి ప్రియమైన సీతను పరిత్యజించాడు ఆ శ్రీరామ చంద్ర మూర్తి..
ధర్మ మార్గాన నడవడం వలన యుదిష్టురుని ధర్మరాజు అని పిలిచారు.
                                    యదాయదాహి ధర్మస్య గ్లానిర్భవతి  భారతా 
                                    అభ్యుత్దాన మధర్మస్య గ్లానిర్భవతి సృజామ్యహం 
అధర్మ పరుల్నిఅధర్మంతో   ఎదుర్కోవచ్చు తప్పులేదు అని శ్రీ కృష్ణుడు ధర్మ పరులైన పాండవులకు సహకరించి, అధర్మ పరులైన కౌరవులను అధర్మంతో  త్రొక్కివేశాడు .
ధర్మ పరుల్ని అంటే ధర్మ పాటించే వారిని అధర్మంతో దెబ్బ తీయకూడదు ..
ఏ మతం అయినా జూదం, వ్యభిచారం, మద్యపానం, ఇత్యాదులను పనికిరావు అని భోదించింది. గాని, మతం మత్తులో అత్యాచారాలు చేయమని చెప్పలేదు ..ఈ నాడు అదే జరుగుతుంది ...

                                                                                                             (సశేషం).....
 
    
      

కామెంట్‌లు

 1. వావ్..... నేను ఈ రోజు ఏదైతే వ్రాయాలనుకున్నానో ఆ అంశం "ధర్మం" గురించి మీరు వ్రాసి పోస్ట్ చేశారు. మీ పోస్ట్ పూర్తిగా చదివిన తర్వాత ఒకటి అర్ధమైందండీ - మీరు వ్రాసినంత బాగా నేను వ్రాయలేనని! చాలా చక్కగా వ్రాశారు. అభినందనలండి.

  రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...