Content

Friday, June 24, 2011

" సర్వేజనా సుఖినో భవంతు"..........

నిన్నటి ధర్మం గురించిన చర్చా విషయాలు చదివి  సత్య పళ్ళెం గారు  స్పందించి వ్రాసినది  చూడండి.. ......

"ధారనాద్ధర్మ మిత్యాహు  ధర్మోధారయతేప్రజాః
యత్స్యాద్ధారణ సంయుక్తం  సధర్మ ఇతినిశ్చయః
ధర్మ శబ్దానికి అర్ధం ధరించుట, ధారణమొనర్చుట.
"ఆహార నిద్రా భయ మైధునం చ సామాన్య మేతత్ పశుభిర్నరాణాం,
ధర్మో హి తేషామధికో  విశేషో, ధర్మేణహీనాః  పశుభి సమానాః "
(భావం: భోజనం,నిద్ర భయం,మైధునం మనుష్యులకు పశువులకు సమానం. మనిషికున్న విశేషత ధర్మం. ధర్మహీనుడు పశువుతో సమానం)

"ధనాని భూమౌ పశవో హి గొష్టే, నారీ గృహద్వారి సఖ శ్మశానే,
దేహశ్చితాయాం పరలోకమార్గే, ధర్మానుగోగాచ్చతి జీవ ఏకః "
(భావం: ధనం  భూమిలో నిలిచిపోతుంది.పశువులు శాలలోనే ఆగిపోతాయి. భార్య ఇంటి గుమ్మంలోనే ఆగిపోతుంది. బంధుమిత్రులు స్మశానం వరకు సాగనంపి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. దేహం చితిపైన కాలిన తర్వాత కూడా పరలోక మార్గమున వెంటనుండి,జీవున్ని అనుసరించి వచ్చేది దర్మం మాత్రమే)
"ధర్మాదర్ధః  ప్రభవతి, ధర్మాత్ ప్రభవతి సుఖం,
ధర్మేణ లభతే సర్వం, ధర్మసార మిదం జగత్"
(భావం: ధర్మం వలన అర్ధం, సుఖం,సర్వం లభిస్తాయి. ధర్మం యొక్క సారమే ఈ జగత్తు)
విషయభోగాలపై ఆసక్తి చేతగాని, లోభం వలన గాని ధర్మ మార్గము విడువరాదు. జన్మతః ప్రాప్తించిన కర్తవ్యంతోపాటు, వృత్తిరీత్యా (గురువులు చక్కటి భోధన ద్వారా, న్యాయవాదులు న్యాయ విచారణ ద్వారా, వైద్యులు రోగనయం చేయడం యిత్యాదులు)  ప్రాప్తించిన కర్తవ్యంతోపాటు సంఘపరంగా (కర్షకులు,గృహస్తులు, పాలకులు.... వారివారి ధర్మములు)ప్రాప్తించిన కర్తవ్యములు అన్నియు స్వధర్మములే. దీనివలన ఋజువర్తన తద్వారా చిత్తశుద్ధి ఏర్పడును. ఈ ధర్మాచరణవలనే వ్యక్తి శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, దేశ శ్రేయస్సు, లోక శ్రేయస్సు కల్గుతుంది. కాని ఇదంత సులభం కాదు,ఎన్నో కష్టనష్టాలు, అవాంతరములు తప్పవు. శాంతం, సహనం, దయ, ప్రేమ, భక్తీ, కార్యదీక్ష, శ్రద్ధ, సమబుద్ధి అలవర్చుకోవాలి. కొంతకాలం ఆచరించి విడిచిపెట్టేటట్లు చేయక అజన్మాంతం ఆచరించేంతగా సాధన చేయాలి. ఇందుకు ఎంతో దీక్ష ఉండాలి. క్రమంతప్పక ఆచరించేది ఏదైనా అది కాలక్రమేణ ఆచరించేవ్యక్తి స్వభావముగా మారిపోతుంది.
సద్గుణ సముచ్చయమే ధర్మం. సద్గుణాలన్ని ధర్మములోని అంశములే. సమిష్టి సద్గుణ సమాహారస్వరూపమే ధర్మం. 
ఇక ఇందులో మరింత నిశితముగా ఆలోచిస్తే మరో విషయం అవగాహనా అవుతుంది- మనం ఆత్మ స్వరూపులం. అది అర్ధం చేసుకొని ఆత్మస్థితిలో వుండడం పరమధర్మం. అంటే దేహభావన, సుఖదుఃఖాలు, జననమరణాలు.... ఇవన్నీ శరీర ధర్మాలుగ ఎరిగి అనిత్యమైన దేహభావనలో వుండిపోక, ఆ దేహాన్ని ఓ ఉపకరణంలా భావించి నిత్యమైన ఆత్మధర్మాన్ని ఎరిగి ఆ పరమోత్తమ మైన  ధర్మమును ఆచరించాలి. జన్మవలన, వృత్తివలన, సంఘంవలన, ప్రాప్తించిన స్వధర్మాలను ఫలాపేక్ష లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరిచడమే మోక్ష సాధనాధర్మం.
సర్వత్ర ఆత్మ దర్శనం, భగవత్ దర్శనమే ధర్మం."
మరి ఇంతటి మంచి విషయాలను మనకు సదా తెలుపమని ఆ భగవంతుని సదా కోరుకుందాము. ".............


© Rukmini Devi J
mmanindarkumarTwitter:ACMWCTRss:mk

1 వ్యాఖ్యలు:

  1. ఇంతటి మంచి విషయాలను మనకు సదా తెలుపమని ఆ భగవంతుని,
    ఆయన కృపతో ప్రేరణతో మిమ్మల్ని కూడా సదా కోరుకుంటున్నాం!!
    ధన్యోస్మి !!
    http://paramapadasopanam.blogspot.com/

    ReplyDelete