ఆధ్యాత్మిక అనుభవాలు

 మన నిత్య జీవితంలో ఎన్నో మలుపులు, ఎన్నో  అనుభవాలు.... అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే  ఆనందిస్తాం, లేకపోతె విచారిస్తాము... ప్రపంచంలో మనకున్న కష్టాలు వేరెవరికీ వుండవనే భావనలో వుంటాము..  ఈ నవ్వడం, ఏడవడం అనేవి  మానసికములు...మనసు మీద ఆధార పడి వుంటాయి...ప్రాపంచిక జీవనం నుండి ఆధ్యాత్మిక జీవనంలోనికి మనకు తెలియకుండానే అడుగులు పాడినప్పుడు చాలా అనుభవాలు, వాటి ద్వారా కొంత కలవార పాటు సహజం.. అకస్మాత్తుగా అప్పుడు అనిపిస్తుంది------ "ఒక వ్యక్తి అవసరం. ఒక గురువు అవసరం" అని. అదేమిటి ? స్కూల్ లో, కాలేజీ లో  టీచర్లు వుంటారు కదా. ఇంకా వేరే గురువు ఏమిటి అనుకోవచ్చు.. అత్యవసరం ....... ప్రాపంచిక జీవనంలో మనకు అమ్మ,నాన్న, ఉపాధ్యాయులు నేర్పేవి అనుసరిస్తే ఒక మంచి వ్యక్తి గా మనల్ని మనం తీర్చి దిద్దుకోగలం.. కాని ఆధ్యాత్మిక ప్రయాణం పూల బాట కాదు.. ముళ్ళ బాట. అడుగులు ఆచి, తూచి వెయ్యాలి.. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా పడిపోవడం తప్పదు.. అందుకే మనకు ఆ బాటలో జాగరూకతతో నడిపించే ఒక వ్యక్తి కావాలి.. ఒక మంచి గురువు కావాలి..దొరికిన వారు అదృష్టవంతులు. దొరకనివారు వారి అన్వేషణ కొనసాగిస్తూనే వుండాలి.. ఈలోగా మనకు కలిగే అనుభవాలను మనకు గురువులుగా స్వీకరించ గలగాలి.. మనల్ని మనం విశ్లేషించుకోగలగాలి... ఈ ప్రయత్నంలో భాగంగా ధ్యానం క్లాసులకు వచ్చే చాలా మంది ఎన్నో విషయాలలో ఆసక్తి కనబరుస్తూ తమ అయోమయాన్ని వ్యక్తం చేస్తుంటారు... అవన్నీ పట్టించుకోకుండా జరిగేది గమనిస్తూ ఉండమని మాత్రమె సలహా ఇవ్వడం జరుగుతుంది.. ఐతే ఆధ్యాత్మిక సత్సంగం గూగుల్ గ్రూప్ వారి చర్చా విషయాలలో ఎన్నో విశేషాలు చోటు చేసుకుంటాయి.. వాటిలో కొన్ని ఈ అనుభవాలకు సంబందించినవి కూడా.. భగవంతునితో వారి సాంగత్య విశేషాలు వుంటాయి.. వారి అనుమతితో మనోహర్ గారి అనుభవాలు, వాటికి శ్రీ సాయి సచ్చరిత్ర ప్రచార  సమితి వారి విశ్లేషణ  ఇప్పుడు పరిచయం చేస్తున్నాను...    
"

జై శ్రీరాం,
శ్రీరామదూతం శిరసా నమామి!

నిజానికి భగవంతుడు తర్కశాస్త్రానికి అందడు అంటారు కానీ, నాకైతే మన జీవితంలో ప్రతీ సంఘటననీ సరిగ్గా తర్కిస్తే అన్నింటి వెనకా ఆ భగవంతుడే కనిపిస్తాడనిపిస్తుంది. లేకుంటే నేనేంటి, నా చేత స్వామి సుందరకాండ పారాయణ చెయ్యించడమేమిటి, రామాయణాదులు తెలుసుకోవాలనే ఆసక్తి కలగడమేమిటి, అనుకోవడమే తడవుగా స్వామి ఆ పుస్తకానికి సంబంధించిన వివరాలనో, ఆడియో రూపంగానో, లేకుంటే పెద్దలద్వారానో తెలియడం అన్నీ వింతగానే అనిపిస్తాయి నాకైతే.
నాజీవితంలోని కొన్ని అనుభవాలు:
మొదట్లో మా నాన్నగారు రోజూ ఆదివారం ఈనాడు పుస్తకం తెచ్చేవారు. అందులో రామాయణం బాపుగారి బొమ్మలతో ఉండేది. తాటకని చంపుతున్న బొమ్మ అయితే నాకిప్పటికీ గుర్తుంది. ప్రతీ ఆదివారం రెండింటికోసం ఎదురుచూసే వాళ్ళం. ఒకటి జంగిల్ బుక్ అయితే రెండవది మా నాన్నగారు తెచ్చే ఈనాడు ఆదివారం లోని రామాయణం. మా నాన్నగారు ఆంజనేయస్వామి భక్తులు. మా కులదైవం నాగారపమ్మ, ఆవుదేవర. ఇలవేల్పు కందుకూరుకు దగ్గరలో ఉన్న మాలకొండ లో వెలసిన లక్ష్మీ నరసింహస్వామి.
మిట్టపాలెం నారాయణస్వామి దగ్గరకు కూడా ప్రతీ సంవత్సరం వెళ్ళేవాళ్ళం. మా ఇంట్లో బాలనాగమ్మ బుర్రకధ పుస్తకం ఉండేది. అది మేము మాకు వచ్చినట్టు చదువుతుంటే, మా నాన్నగారు అర్ధం చెపుతూ తప్పులు సరిచేసేవారు. ఆ తరువాత TTD వారు అప్పట్లో మొదలుపెట్టిన ధర్మప్రచార సమితి పుణ్యమా అని భగవద్గీత, భారతం మా ఇంట్లో చేరాయి. భారతం వచ్చిన మూడురోజులకి మా అన్నయ్య , నేనూ పోటి పడి చదివేశాము. ఎంత గుర్తుందంటే సందేహమే కానీ, చదివాము, అప్పట్లో భారతం చదివాము  అన్నఊహే గొప్పగా ఉండేది. ఇవి కాక మాకు కాటమరాజు కధలు ఉండేవి. వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు, వాళ్ళ తండ్రుల కధలు మా గొప్పగా ఉండేవి. మా నాన్న గుర్తున్నంతవరకూ చెప్పేవాడు. మా నాన్న గారు ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళేవారు. రోజూ ఇంట్లో ధూపం వేసేవారు. ఆయన లేకపోతే నేను వేసేవాడిని. తొమ్మిదవతరగతి నుండి నేను వేసేవాడిని. పదవతరగతిలో మా నాన్నగారు నాకు సైకిల్ కొనిచ్చారు. మంగళవారం గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ సైకిల్ కి హాండిల్ మీద సింధూరం పెట్టి నడుపుతుంటే స్వామి కూడా నాతో పాటు సైకిల్ మీద వస్తున్నట్టుండేది. హాయిగా ఉండేది. కాలేజీలో చేరాక ఆ సైకిల్ మరింతగా నా జీవితంలో పెనవేసుకుపోయింది. ఎంతచీకట్లో అయినా , ఎంతవానలో అయినా అలాగే తొక్కుకుంటు వెళ్ళిపోయేవాడిని. చాలీసానో దండకమో చదువుకుంటూ ఉంటే చీకట్లో, వానలో ఎవరూ తోడు లేకుండా వెల్తున్నానన్న భావన ఉండేది కాదు. కానీ ఇంటర్మీడయట్లో కొంచెం దారితప్పాను. అసలే చపలత్వం, పైన తోటి ఫ్రెండ్స్ కొంచెం ప్రభావితం చేసారు. ఫలితం ప్రతీ మంగళవారం గుడికి వెళ్ళే అలవాటు గుడ్డు పెట్టింది. తరువాత నేను చెడిపోయాను, ఇక ఆ భగవంతుడు నన్ను క్షమించడు, ఈ జీవితం ఇంతే అన్న భావన పెరిగిపోయింది.  ఇలా అటూ ఇటూ ఊగిసలాడుతూ జీవితాన్ని లాక్కొస్తున్న సమయంలో అమ్మఒడి బ్లాగు చదివాను. కొంచెం నమ్మకం వచ్చింది, భగవంతుడు మనలని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళడు, మనం చేతులు చాచి పిలిస్తే ఆదుకోవడానికి,అందుకోవడానికి ఎప్పడూ సిద్ధంగా ఉంటాడు  అన్న ఒక భావన కలిగింది. కానీ ఎలా మొదలుపెట్టాలి , ఏం చేయాలి తెలియలేదు. మళ్ళీ ఆ స్వామే మార్గం చూపించాడు. surasa.net లో హనుమద్వైభవం అన్న ఆడియో విన్నాను. ఎన్నిసార్లు విన్నానో నాకే తెలియదు. తర్వాత దుర్గేశ్వర గారి బ్లాగు గురించి నాగప్రసాద్ చెప్పడం,వారి బ్లాగు ఫాలో కావడం జరిగింది. అందులో హనుమజ్జయంతికి గురువుగారు చాగంటి కోటేశ్వరావు గారిచ్చిన ప్రవచనం విన్నాను. తరువాత స్వామి కృప వలన సుందరకాండ వినడం, రామాయణం వినడం.అది కూడా పద్ధతిప్రకారం(రామాయణం వినాలనుకునే వారు ముందు సుందరకాండ పారాయణ చేసి రామాయణం పారాయణ మొదలుపెడతారట, నాకు తెలియకుండానే నేను అలాగే చేసాను. భాగవతంలో దశమస్కంధం కూడా ఇలాగే చదవాలి. అది కూడా నాకు తెలియకుండా అలాగే చదివాను. ).తరువాత హనుమద్రక్షాయాగంలో పాల్గొనడం జరిగింది.తర్వాత మా ఇంటిదగ్గర  గజేంద్రమోక్షం పుస్తకం దొరికింది. ఆ పుస్తకం నా దగ్గరికొచ్చిన కొన్నాళ్ళకి పూణె వెళ్ళవలసివచ్చింది. అక్కడ సమయం బాగాదొరికేది. దానితో గజేంద్రమోక్షం అర్ధంచేసుకోవడం మొదలుపెట్టాను. ఆఫీస్ నుండి రావడం, పుస్తకం పట్టుకుని కూర్చోవడం, కొన్ని రోజులు కలలు కూడావచ్చేవి. తర్వాత సుందరకాండ పారాయణచెయ్యాలనే బుద్ధి కలిగించాడు స్వామి. మొదలుపెట్టాను. ఒక రోజు ఒక పెద్ద అపరాధం చేసాను. నాకే సిగ్గనిపించింది.తరువాత మాస్టరుగారు యాగం రెండవ ఆవృత్తి ప్రకటించారు. ఈసారి ఎలాగైనా నిష్టగా చెయ్యాలనుకున్నాను. చేయించారు స్వామి, చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత ఇంతమందిపెద్దలతో పరిచయం ఏర్పడడం, వారి అనుభవాలు వినడం మరింతగా భగవంతుడి ఉనికిని గుర్తించడంలో తోడ్పడ్డాయని నా నమ్మకం. ఈమార్గంలో ప్రత్యక్షంగా నన్ను పొత్సహించిన వారు , పరోక్షంగా ప్రోత్సహించిన వారు చాలామంది ఉన్నారు. వారందరికీ పేరుపేరునా నా ప్రణామాలు. ఈ మూడేళ్ళలో ఎంతోమంది హనుమదుపాసకులని కలవగలిగాను. అంతా స్వామి కృప.
కష్టాలు ఎప్పుడూ ఉంటాయి.కానీ అవి భరించే శక్తి భగవంతుడిని నమ్ముకున్నవాడికి ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఒక తక్కెడ మోస్తున్నాడనుకోండి. ఎంతసేపు మోయగలడు, వాని ఓపిక ఉన్నంతవరకు, తరువాత అలసిపోతాడు, శక్తిబేధాలను బట్టి కొంతముందూ వెనుకా, ప్రతిఒక్కరు అలసిపోతారు. అదే ఎప్పటికీ అలసిపోనివాడు తోడొస్తే తక్కెడ ఎంతసేపు మోసినా అలుపు ఉండదు.
అలాంటివాడే భగవంతుడు. కష్టమని మానెయ్యచ్చు భగీరధుడు, కానీ మానెయ్యలేదు, కష్టమని మానెయ్యచ్చు హనుమ, కానీ మానలేదు. కష్టమని శిబి ధర్మాన్నీ, బలి దానాన్ని వదిలెయ్యలేదు, మరిమనమెందుకు కష్టమని భగవంతుడిని వదిలెయ్యాలి. కష్టం దేనికి? శరీరానికా మనసుకా , ఈ ప్రశ్న కి సమాధానం ఆలోచిస్తే అంతా చాలా సులభంగా కనపడుతుంది..............
శ్రీ సాయి సచ్చరిత్ర ప్రచార సమితి వారి విశ్లేషణ ........ చూడండి .........
"కష్టాలు ఎప్పుడూ ఉంటాయి.కానీ అవి భరించే శక్తి భగవంతుడిని నమ్ముకున్నవాడికి ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషి ఒక తక్కెడ మోస్తున్నాడనుకోండి. ఎంతసేపు మోయగలడు, వాని ఓపిక ఉన్నంతవరకు, తరువాత అలసిపోతాడు, శక్తిబేధాలను బట్టి కొంతముందూ వెనుకా, ప్రతిఒక్కరు అలసిపోతారు. అదే ఎప్పటికీ అలసిపోనివాడు తోడొస్తే తక్కెడ ఎంతసేపు మోసినా అలుపు ఉండదు. అలాంటివాడే భగవంతుడు. కష్టమని మానెయ్యచ్చు భగీరధుడు, కానీ మానెయ్యలేదు, కష్టమని మానెయ్యచ్చు హనుమ, కానీ మానలేదు. కష్టమని శిబి ధర్మాన్ని, బలిచక్రవర్తి    దానాన్ని వదిలెయ్యలేదు, మరిమనమెందుకు కష్టమని భగవంతుడిని వదిలెయ్యాలి. కష్టం దేనికి? శరీరానికా మనసుకా , ఈ ప్రశ్న కి సమాధానం ఆలోచిస్తే అంతా చాలా సులభంగా కనపడుతుంది"
 ఈ సందేశాన్ని అలా  చదివి వదిలేయకండి -  పదే   పదే చదవండి - పెద్ద తత్వ రహస్యం ఉంది -- అలసట మనసుకి చేరనివ్వకండి.  ఇతర  విషయాలలో లేని అలసట దైవ ధ్యానం,  పూజ, భగవత్ కథా శ్రవణం పట్ల ఎందుకు వస్తోందో గమనించి సరిదిద్దుకోండి.  ఎలా ?  -- మన పూజ్య గురువుల ప్రవచనాలు వింటుంటే కొంచం కొంచం మనసు స్వస్తతకు రావడానికి ప్రయత్నిస్తుంది.  సాధనమున పనులు సమకూరు ధరలోన అని కదా పెద్దల మాట.  మల్లి అనుమానం - గురువు గారి ఏ ప్రవచనం వినాలి ? -  ప్రతి ప్రవచనం ఒక అమృత రస ధారే అయినా మనసు విషయంలో  శ్రీ శంకర భగవత్ పాదుల మోహ ముద్గరం,  శివానందలహరి, ధూర్జటి kaalahasteeswara   శతకం ప్రవచనాలలో మన గురువు గారు మనకందించిన జ్ఞాన హస్తం తప్పకుండా మనల్ని ఒక దరి చేరుస్తుంది.  మరొక చిన్న విషయం.  పై సందేశంలో "భగీరథుడు" అనగానే గంగావతరణ  ఘట్టం ఒక సారి తలచినంతనే సర్వ పాపహరం; మన స్వామి హనుమ అనగానే సుందరమైన సుందరకాండ ఒకాసారి మనసార ధ్యానిస్తే "బుద్ధిర్బలం, యశో ధైర్యం నిర్భయత్వమరోగతా - అజాడ్యం వాక్పటుత్వంచా హనుమత్ స్మరణాత్ భవేత్", ధర్మ స్వరూపుడైన శిబిచక్రవర్తి ని స్మరిస్తే సర్వ దోషాలు తొలగిపోతాయని ప్రాజ్ఞుల మాట.  ఇంకా బలిచక్రవర్తి - శ్రీ మన్నారాయణుని వామనావతార  ఘట్టం - శ్రీమద్ భాగవతంలో పతాక సన్నివేశం  ...  ఈ విధంగా మనందరిచేతా ధ్యానం చేయించిన ఫలితం శ్రీ మనోహరగారిది.  ఆయన పేరే మనోహరుడు .   సర్వేజనాః సుఖినోభవంతు  
ఈ వ్రాయడంలో ఎటువంటి తప్పులున్నా, చపలత్వం కనిపించినా క్షంతవ్యులం....
జై సాయిరాం...........
చదివారు కదా.. ఈ అనుభవాలు మనలను మంచి మార్గం లో నడిపించే గురువులని నమ్ముతూ.......... మీ విదేయురాలు...  
     

కామెంట్‌లు

  1. i am vidya sagar, from vijayawada, vidsag11@gmail.com is my id, mee blog antha bagundi, mee guruvu garu evvaru, adhyatmikamga, veelaithe na id ki mail cheyyandi, meeku adhyatmika vikasam yee janma lone mukthi kalige avakasam kanabadutondi. brahmaiva bhavathu.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం