సత్సంగం

అందరికీ నమస్కారం....నేను ఈ మధ్యనే గూగుల్ సత్సంగం గ్రూప్ లో జాయిన్ అవడం జరిగింది...
ఎందరో పెద్దలు ,అనుభవజ్ఞులు, జరిపిన కొన్ని అతి ముఖ్యమైన ఆధ్యాత్మిక చర్చలు మీ అందరికీ పరిచయం చెయ్యాలని ఆకాంక్షతో, వారి అనుమతితో అందరికీ ఉపయోగపడే ఆధ్యాత్మిక విషయాలను నా బ్లాగ్ లొ పోస్ట్ చెయ్యడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.. ఇది కేవలం    పుస్తక పరిజ్ఞానం ఎంత ఉన్నప్పటికీ, తమ తమ స్వీయ ఆధ్యాత్మిక మరియు ప్రాపంచిక  అనుభవాలు మన జీవన పయనంలో ఎంతగా దోహదపడతాయో తెలిపే   ప్రయత్నం....సదుద్దేశ్యపూర్వకమైనది..... ఈనాటి  చర్చలో భాగంగా "ధర్మం" ఏ పాత్ర వహించిందో చూద్దామా మరి............. 
ముందుగా అయ్యవారి నాగేంద్ర గారు అడిగిన ప్రశ్నలు చూడండి .....

" ధర్మం అంటే ఏమిటి?
దాని స్వరూపమేమి?
ధర్మాన్ని పట్టుకుంటే జరిగేదేమిటి ఒరిగెదేమిటి?
ధర్మాన్ని పట్టుకోవడంలో వచ్చే వైక్లవ్యాలు ఏమిటి?

వగైరా వగైరాలు కొన్ని
దృష్టాంతాలతో.. ఎవరికెంత తెలుస్తే అంత తెలుపవచ్చు."   అన్నారు.... 
 
సమాధానంగా  రాజశేఖరుని విజయశర్మగారు  ఇలా చెప్పారు ...........

"సత్యము, శౌచము, తపస్సు, దయ అను నాలుగు ధర్మ దేవత పాదములుగా పేర్కొన్నారు. ( అంటే వీటి కలయికనే ధర్మదేవతా స్వరూపము గా భావించ వచ్చు)  భాగవతంలో ఈ ఘట్టం వివరింప బడి ఉంది.

నాలుగు పాదములలో 3 నశించి ఒక్క కాలు మాత్రమే మిగిలినందులకు గోరూపంలోని భూదేవి విలపిస్తుంది. నశించినవేవి? శౌచము, తపస్సు, దయ అను నవి నశించినవి. మిగిలినది సత్యము. ఇది ఎప్పటికీ నశించదు. దుష్ట సంగము వలన శౌచము, సమ్మోహము వలన తపస్సు, అహం కారము వలన దయ నశించినవి.ఈ మూడు పాదములు నశించుటచేత దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధీయుతులకు, నీకు, నాకు, గోవులకు, వర్ణాశ్రమలకు బాధ కలుగుతుంది కదా అని భూదేవి విలపిస్తుంది.

ఈ కథ నాబ్లాగులో రాశాను. అది ఇక్కడ చూడవచ్చు. http://rajasekharunivijay.blogspot.com/2010/06/blog-post.html 

ధర్మం అంటే మొదట తాను మంచి అని నమ్మిన దానిని ఆచరించడమే ధర్మమని చెప్పవచ్చు. అయితే అది అంత తేలికైన విషయమేమీ కాదు.  కేవలం తన బుద్ధి చెప్పిందల్లా ఆచరిస్తూ పోతే అది ధర్మమవ్వ్వదు. ఎందుకంటే అందరి బుద్ధీ సక్రమంగా ఉండదు కనుక. అందుకని ముందు ధర్మ స్వరూపం తెలియాలంటే పురాణ, ఇతిహాసాలను చదవాలి. అందువలన వేద ప్రతిపాదిత ధర్మం తెలుస్తుంది. చదివిన పురాణాలను మరల మరల మననం చేస్తుండాలి. అందువలన మనసుకు ధర్మం అలవడుతుంది. తద్వారా కలిగిన బుద్ధితో కర్మలను ఆచరించాలి. వీటిలో భాగమే సత్సాంగత్యం. పెద్దల వాక్యాలను, ప్రవచనాలను వినడం, సద్గ్రంధాలను చదవడం, వాటిద్వారా ఏర్పడిన బుద్ధితో బాగుగా ధ్యానం చేసి ఒకటికి పది సార్లు ఆలోచించి ముందుకు వెళ్లడం. అప్పుడు అది ధర్మ మార్గం అవుతుంది.  ధర్మాన్ని పట్టుకుంటే కష్టాలు వస్తాయి అన్నది చాలా మంది అభిప్రాయం. కానీ అది నిజం కాదు. ధర్మాచరణం వలన ఆనందం మిగులుతుంది. ఏపని చేసినా మంచే చేస్తున్నామన్న నమ్మకంతో చేయడం వలన మనసుకు అనవసరవ్యధలు కలుగవు. మరి ఉత్తేజ కరమైన మనసుతో సాధించలేనిది ఏముంది? ధర్మాన్ని అనుసరించే వారికి ధైర్యం పాలు ఎక్కువ. 

  పంచకట్టుకుని, శిఖ పెట్టుకుని బయటకు వెళ్లాలంటే సాంప్రదాయం మీద నమ్మకం, ప్రేమ ఉంటే సరిపోదు. ధైర్యం కావాలి. ఎంత ధైర్యం ఉంటే, ఎంత ఆత్మ విశ్వాసం ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్లు ప్యాంటు, షర్టుల తో తిరుగుతుంటే మనం పంచె కట్టుకోగలం అన్నది ఆలోచించండి. స్త్రీ విషయంలోనూ అంతే. చుట్టూ ఉన్నవారు మినీ స్కర్టుల స్థాయికి దిగజారిపోతుంటే, ఇంకా చీరని అభిమానించి, ఆ చీరకట్టులోనే విదేశాలలో సైతం తిరగాలంటే ఎంత నమ్మకము, ప్రేమ, ధైర్యము ఉండాలి? కేవలం సాంప్రదాయాన్ని ఆచరించడానికే ఇంత ఆలోచించాల్సి వస్తే , మరి ధర్మాన్ని నమ్ముకున్నవారు ఎంత లోతు ఆలోచిస్తారో? ఎంత ధైర్యం తో ముందుకు నడుస్తారో? మనం ఊహించవచ్చు."  అని చెప్తూ మరికొన్ని విషయాలు కూడా చెప్పారు..

"దేశ, కాల, వ్యక్తులను బట్టి ధర్మము మారుతుంది.  బ్రాహ్మణునికి వేదాధ్యయనము ధర్మము, మరి క్షత్రియునికి అధర్మ పరులను మట్టు బెట్టుట ధర్మము. అంటే వ్యక్తులను బట్టి ధర్మము మారుతున్నట్లే కదా! అలాగే ప్రాంతమును బట్టి, కాలమును బట్టికూడా ధర్మము మారుతుంది. ధర్మానికి అంతః సూత్రమైన సత్యము మాత్రము మారదు.  స్త్రీ కి కొన్ని ధర్మాలు విధించినా, పురుషునికి కొన్ని ధర్మాలు విధించినా, వర్ణానికొక ధర్మాన్ని విధించినా అవి అన్నీ సత్యమును తెలుసుకొనుటకే దోహదములగుచున్నవి."
"ధర్మాన్ని పట్టుకుంటే జరిగేదేమిటి ఒరిగెదేమిటి?   ధర్మాన్ని పట్టుకుంటే సత్యమేమిటో తెలుస్తుంది."  అని ........

మరి  రామానుజం సుదీర్ కుమార్ గారు  ఏమన్నారో విందామా.......
 
"సత్యము ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది దానిలో మార్పు ఉండదు ఇలాగ -  " సూర్యుడు
తూరుపున ఉదయించి పడమర అస్తమిస్తాడు".
కాని ధర్మము కాలానుగుణముగా మారుతుంది. " మనము గోవును పవిత్రమైనదిగా
పూజిస్తాం గౌరవిస్తాం కాని అదే గోవు వచ్చి మన పొలాన్ని అంతటిని పాడు
చేస్తుంటే ఆహా గోవు మన పొలమును ఎంత చక్కగా పాడు చేస్తుందో అని చూస్తూ
ఉంటామా లేదు దానిని కర్ర పుచ్చుకొని భయపెట్టో లేక కొట్టి తరిమేసి మనము
కస్టపడి పండించే పొలాన్ని కాపడుకుంటాము  ".

ఇదే ధర్మము, ధర్మము ప్రకృతి నియమము అనగా  ప్రకృతియే ధర్మము.
కాలనుగున్యముగా వాతావరణ మారుపు జరుగుతుంది.

సింహము, పులి మొదలగు క్రూర జంతువులూ మాంసము తిని బ్రతుకుతాయి అది వాటి
ధర్మము మృగధర్మము.
జలచరాలు, పశువులు, పక్షులు, సర్పములు, క్రిమి కీటకాలు, చెట్లు,
మృగములు....... ఒకటననేల, మానవుడు తప్ప అన్ని జీవరాసులు వాటి పాప ఫలితము
వల్ల ఉత్తమ మయిన మానవ జన్మ పొందక ఫలితాన్ని అనుభవిస్తున్నాయి. ఎందుకనగా
అవి మానవ ధర్మాన్ని పాటించక రాక్షస ధర్మాన్ని పాటించడమే కారణము.

రాక్షస ధర్మము అనగా - నేను అనే అహముతో కామా, క్రోధ, లోభ...... మనేడి
గుణములతో అసుయపరుడై అహంకారుడై స్వార్ధ చింతనతో పరులను దూషిస్తూ దేశిస్తూ
తలిదండ్రులను మరచి గురువులను మరచి దైవాన్ని విడచి తన కోరికలను
నెరవేర్చుటకై చేసే వికృతమయిన చేష్టలన్నీ రాక్షస ధర్మములు.

మానవ ధర్మము అనగా - పకృతి నియమములకు లోబడి లోక కారకుడయిన ఆ దేవదేవుడిని
జ్ఞానకారకుడయిన  ఆ గురుదేవుడిని జన్మకారకులు అయిన తండ్రిని తల్లిని మరువక
నిత్యమూ పూజించుచు పెద్దలను గోవరవిస్తూ పిన్నలను
ప్రేమిస్తూ ,జ్ఞానాభివృద్ధి చేస్తూ  నేను నా అనే స్వభావమును త్యజించి
పరోపకారము చేస్తూ కోరికల వల్ల జనించే దుర్బుద్ధిని  చేరచుచు సద్బుధ్ధితో
తన కోరికలను పొందుతూ "మిత వ్యర్ధం మధ్య ముత్తమం అతి ప్రమాదం" అన్న రీతిలో
కోరికలను తప్పులను  తగురీతిగా సరిదిద్దుతూ తానూ చేయుపనిని వేరేవారిపై
పెట్టక  తన బలమును మించక మొదలగు|| చేయు కార్యములన్ని మానవ ధర్మాలు.

ప్రకృతి నియమాలే ధర్మములు

చెట్లు స్వార్దాన్ని కోరక ఫలాలను అందిస్తుంది. కోకిల లాభామాశించక తన మధుర
స్వరాన్ని వినిపిస్తుంది. పువ్యులు ఏమీ ఆశించక మకరందాన్ని ఇస్తాయి
సుగంధాన్ని వెదజల్లుతాయి.ధర్మము నిశ్చలము కానిది అది ఎప్పుడు చలిస్తూ
ఉంటుంది."

బత్తుల సురేష్   గారు...........  

"ధర్మము అనగా మానవత్వాన్ని రక్షించే గుణము. హిందూ దేశమునకు ధర్మక్షేత్రమని పేరు. సకల ప్రాణికోటిలో మానవ జన్మము ఉత్తమమైనది. ఇలాంటి మానవత్వాన్ని పరిరక్షించేవిషయంలో మానవజాతి ఒక్కటే సమర్ధమైనది. ఇతర ప్రాణులలో లేని బుద్ధి విశేషముగా ఉండటమే దీనికి కారణము. ఆహార భయ నిద్రా మైథునములు అన్ని ప్రాణుల యందుసమానమై, కేవలము యుక్తాయుక్త విచక్షణ, ఆలోచనకు రూపమీయగల ప్రజ్ఞ బుద్ధి ద్వారా సాధ్యమై ఉత్తమ గుణాన్ని సాధించవచ్చును.
మానవులు తమకు కలిగిన సత్సంకల్పాలను ఇతరులకు నష్టము కలిగించకుండా నెరవేర్చుకొనడమే ధర్మము యొక్క ముఖ్య లక్షణమని చెప్పవచ్చును. భూమి మీద సకలమానవులలోను కొందరు ఉత్తములుగా నుండి తోటి మానవులలో పూజింపబడితే దైవ సమానులుగా భావించబడడానికి వారు ఆచరిస్తున్న ధర్మ గుణమే ప్రధాన కారణము. శాంతి, దయ, అహింస, సత్యము, అస్తేయము, ఉపకారము, సానుభూతి, శౌచము మొదలగు సుగుణము లన్నీ ధర్మమునకు అవయవాలై ఉన్నాయి.
ధర్మానికి వేదాలు ప్రమాణాలు. ధర్మాధర్మ విచక్షణ వచ్చినపుడు సత్పురుషులు ఆలోచించి తగిన నిర్ణయం చేసి ధర్మ పక్షపాతులై వ్యవహరిస్తారు. ఇటువంటి ప్రమాణికమైన ధర్మాన్నిఆచరించినవారు ఇహలోకాల్లో కీర్తిని, సుఖాన్ని పొందుతారు.
బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసములు అనే ఆశ్రమములను చతుర్వర్ణాలలో మానసిక సంస్కారమును బట్టి అందరూ ఆచరించవచును. బ్రహ్మచారికి వేదాధ్యయనము, గురుశుశ్రూష, ఇంద్రియ నిగ్రహము, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు. గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచారనిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములు. వానప్రస్థుడు ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమునువీడి సంతానమునకు వ్యవహార మప్పగించి ధర్మపత్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం ధర్మము. వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించికామక్రోధాదులను జయించి నిర్లిప్తుడై శేష జీవితమును లోకొద్ధరణకై ధర్మ ప్రబోధనైక లక్ష్యముతో ఆత్మ సాక్షాత్కారంతో సన్యసించుట యక్తము
శ్రీ శ్రీ శ్రీ గణపతి సత్చితానంద స్వామిజి వారి కీర్తన ధర్మం మీద
రాగం : దేశ
తాళం :

పల్లవి :
రాముడే ధర్మము ధర్మమే రాముడు
రూపుదాల్చినట్టి ధర్మదేవతే రాముడు

చరణం :
తండ్రిమాట దాటకూడదన్న దల్పము
తండ్రి మనసు తెలిసి నడచుకొనుట భవ్యము
తండ్రి పరులకిచ్చు మాటకొరకు తానుగా
రాజ్యమెల్ల తృణమన్నది రాముడొకడెగా ...1

క్షత్రజాతిహంతయైన పరశురాముని
పొగరుదింపి కనులు తెరచునట్లు చేసియు
వినయభావ మీగకుండ గౌరవించెను
జాతి సామరస్య దృష్టి పరిధి చూపెను ...2

లోకహంత్రి కాన తాటకను వధించెను
తనకె శత్రువైన శూర్పణఖను విడచెను
ప్రాణసంకటమ్ము గూర్చు ఘట్టమైనను
రామచంద్రు ధర్మనిరతి దారితప్పదు ...3

వాలి నేస్తుడైన యెడల రావణాసురున్
గెల్చుటెంతొ సులభమంచు తెలిసి యున్నను
వాలి జంపి సుగ్రీవుని రాజు చేసెను
ధర్మమొకటె తనకు ముఖ్యమనుచు చాటెను ...4

విభీషణుండు వచ్చి శరణు వేడగా
వెనుక ముందు చూడకుండ శరణమిచ్చెను
శరణుకోరినట్టివారి కభయమిచ్చుటే
తనకు వ్రతము సుమ్మటంచు చాటి చెప్పెను ...5

అలసియున్న రావణుని విశ్రమింప బంపెను
మరణించిన రావణుని మెచ్చి గౌరవించెమ
చావె హద్దు వైరమ్మున కంచు లెస్స బల్కెను
వైర మెరుగనట్టి ధర్మ వీరమ్మును జూపెను ...6

వ్యక్తిసుఖము కన్న రాజధర్మ మధికము
రాజధర్మమందు వ్యక్తిప్రేమ శూన్యము
కాన సీత నగ్గిపాలు జేసి నిల్చెను
అగ్గిపూతయైన సీతనాదరించెను ...7

ఎల్ల భూమి నొక్క గొడుగుక్రింద నిల్పెను
నిల్పి రాజవంశశతికి పంచి యిచ్చెను
రాజ్యమన్న దనుభవించు కొరకు కాదనీ
రాజ్యమే ఉపాసనమ్మటంచు చూపెను ...8

క్రూరమైన రాజధర్మమందు నిల్చియు
అర్హులైనవారికాత్మ తత్త్వ మిచ్చెను
తనకుచుట్టు నున్నయట్టి జీవవితతికి
స్వీయమైన సచిదనందసారమిచ్చెను ...9


జనకమహారాజు వశిష్ఠుడు తో వారు చెప్పినదంతా విని "మహానుభావా! ధర్మము బహు సూక్ష్మమనియు, పుణ్యము సులభముగా కలుగుననియూ, అది - నదీస్నానము, దీపదానము, ఫలదానము, అన్నదానము,వస్త్రదానము,వలన కలుగుననియు చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగాయజ్ఞయాగాదులుచేసినగాని పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుందురుగదా! మరి తమరు యిది సూక్ష్మములో మోక్షముగా కనరబరిచినందుకు నాకుఅమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగామోక్షము పొందుట వజ్రపు కొండను గోటితోపెకలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులీకరించ ప్రార్థించుచున్నాను" యని కోరెను.
అంతట వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే, నేను వేదవేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మమార్గాలున్నవి. అవి యేమనగా సాత్త్విక, రాజస, తాపసములు అని ధర్మము మూడురకములు.
సాత్త్విక, మనగా దేశకాల పాత్రలు మూడునూ సమకూడిన సమయమును సత్త్వమను గుణము జనించి ఫలమంతయును పరమేశ్వరార్పితము కావించి, మనోవాక్కాయ కర్మలచేనొనర్చిన ధర్మము. ధర్మమందు యెంతయో ఆధిక్యత కలదు. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనమొనర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణినది సముద్రమున కలియ తావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి ధగధగ మెరిసి, ముత్యమగు విధముగా సాత్త్వికత వహించి, సాత్త్వికధర్మ మాచరించుచూ గంగ, యమున,గోదావరి కృష్ణనదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలముల యందూ దేవాలయములయందూ - వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్పదానము చేసిననూ, లేక నదీతీరమందున్న దేవాలయంలో జపతపాదు లొనరించినను విశేషఫలమును పొందగలరు.
రాజస ధర్మమనగా - ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్తవిధులను విడిచి చేసిన ధర్మం. ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించున దగును.
తామస ధర్మమనగా - శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్ధం చేయు ధర్మం. ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసిననూ గొప్ప ఫలము నిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించినచో వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు." అని చెప్పారు..

మోహన రావు గారు........
 

"ధర్మము అంటే ఇతరులకు  శ్రేయస్కరము అయిన దానిని ప్రేతితో వారికి చేయుట ధర్మము. మొదటిది  శ్రేయస్కరము రెండవది ప్రీతి. రెండూ వుంటే మంచిది.
ఇది మనకి ఎలా తెలుస్తుంది. వీటికి ప్రమాణాలు వేదములు , ఇతిహాసములు, శాస్త్రములు. పెద్దల మాటలు/ చేష్టలు, సత్పురుష సాంగత్యము.
రామాయణములో రాముడు ప్రతి అడుగు లోను  దీనిని చూపిస్తాడు. అల్లాగే ధర్మాచరణ కు అనేక ప్రతిబంధకాలు వుంటాయి అని గూడా చూపించాడు.
ధర్మము అన్నది తాను వున్న స్తితి పైన ఆధారపడి వుంటుంది . స్తితి అంటే లింగము, అవస్థ, కాలము, వాతావరణము ఇత్యాదులు. ఉదాహరణకు పితృ ధర్మము, పుత్ర ధర్మము, పతి ధర్మము వేరు వేరు.

 ధర్మము అనేది మార్పు చెందేది. సత్యము అన్నది మార్పు చెందనిది. వీటిని పది రూపాయల నోటుతో పోల్చి చెప్పుతారు. దాని విలువ పది రూపాయలు సత్యము. అది ఎల్లప్పుడు పది రూపాయలే వుంటుంది. కాని దాని పరిమాణము, రంగు ఇత్యాదులు  మార్పు చెందుతూ వుంటాయి.

ధర్మము సామాన్య ధర్మము మరియు విశేష ధర్మము అని రెండు వుంటాయి. రాముడు సామాన్య ధర్మమును ఆచరించాడు. లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు విశేష ధర్మమును ఆచరించారు. ఈవిషయాలు తర్వాత వివరిస్తాను.
మనము ధర్మాచారణము యందు వుండాలి. పరిస్తులనుబట్టి మార్పులు చేసుకోవాలి. హైదరాబాదు లో నగర సంకీర్తన ఉదయం 5 గంటల నుండి  6 గంటల వరకు చెయ్యవచ్చు. ఇది అమెరికాలో సాధ్యము కాదు. కేవలం మానసికముగా చేసుకోవాలి. ఈవిధము గా అనేక అసాధ్య విషయములలో మానసిక ప్రక్రియ ను ఆశ్రయించ వలసి వస్తుంది. దీనిని ఒక సాకుగా వాడకూడదు. మనకు మనమే సాక్షి..............

  ధర్మ జ్ఞానము ఎంత ముఖ్యమో ధర్మాచరణం గూడ అంతే ముఖ్యం. ఆచరణ లేని జ్ఞానము వలన ప్రయోజనము లేదు. ధర్మజ్ఞానము ను ఇతరులు ఆచరిస్తున్నారా లేదా అన్నదానికి వాడకుండా, మనము ఆచరిస్తున్నామా లేదా అన్నదానికి వాడాలి. ప్రతి క్షణము మనము ధర్మమును ఆచరిస్తున్నామా లేదా అని చూసుకుంటూ మన మాట, చేష్ట, ఆలోచన వుండాలి.
 

 అయితే కలికాలములో అనేక కారణముల వలన మన ఆలోచన విధానమునకు తగిన ధర్మాచరణ అందరిలోనూ చూడము. అంత మాత్రము చేత మనము ధర్మమును వదలరాదు. ఎదురుకుండా  వారికీ మనము ధర్మము చేసి చూపించడము లేదా సూచన. అంతటితో  ఆగి పోవాలి. ఎదురుకుండా వాళ్ళు ధర్మమును ఆచరించనప్పుడు మనము వారిపై   పరిమితి మించి ఒత్తిడి  కూడదు .వారు చెయ్యుట లేదని మనము బాధపడకూడదు. కొన్ని పరిస్తుతులలో మనము  చెప్పలేము కూడా.( ఒక పెద్ద మనిషి అందరి ముందర అబద్దాలు విచ్చల విడిగా చెప్పేస్తూ వుంటాడు.)

ధర్మాచారణము  విషయములో మనము కలియుగములో వున్నాము అని గుర్తించి నడుస్తూ వుండాలి. ప్రతి క్షణము మనము ధర్మమును ఆచరిస్తున్నామా లేదా అని చూసుకుంటూ పోవాలి."  అన్నారు...

ఇక నేను నాకు తెలిసిన ధర్మం మాత్రమె చెప్పాను...

నాకు తెలిసిన ధర్మం:
 
ఏ కాలంలో ఐనా ధర్మం, ధర్మమే.. ప్రత్యామ్నాయం వుండదు..
1.  తమ సంతానాన్ని కనుపాపల్లా కాపాడుకోవడం కన్నవారి ధర్మం.....
2. వృద్దులైన మాతాపితురులను పసిపాపల్లా సేవ చేయడం వారి సంతానం యొక్క ధర్మం........
3. కుటుంబగౌరవాన్ని పదిమందిలో ఉన్నతంగా నిలపడం కోడలి ధర్మం......
4. పుట్టింటి గౌరవాన్ని కలకాలం నిలిపేలా అత్తింట నడుచుకోవడం కూతురి ధర్మం...
5. కుటుంబ భారాన్ని సవినయంగా స్వీకరించడం మగవాడి ధర్మం....
6. భర్త అడుగుజాడల్లో జీవన సహచరియై ధర్మచారిణిగా కుటుంబ బాధ్యతను వహించడం, భర్త, పిల్లల, అత్తామామలు, తదితర బంధువర్గ ఆలనా పాలనా చూడడం స్త్రీ ధర్మం...
7. తోటి మనిషికి తన వల్ల ఎలాంటి అపకారం జరగకుండ చూసుకోవడం మానవతాధర్మం........
. ఇక రాక్షస ధర్మం, దేవతా ధర్మాల గురించి అందరికీ తెలిసిందే...
8. ప్రజలను కంటిపాపల్లా సంరక్షించడం రాజుగారి ధర్మం...........
9. తమ ధర్మాన్ని నిర్వర్తించేవారికి సహకరించడం ఉత్తమ పౌరుని ధర్మం..
10. స్త్రీని కాపాడటం పురుషుని ధర్మం.....

ఎవరి ధర్మాన్ని వారు అనుసరించడం న్యాయం....
"అమ్మా! ధర్మం చేయండి తల్లీ", అని ఇదివరకు రోజుల్లో సాధువులు, బిచ్చం ఎత్తేవారు ఎందుకు అలా అనేవారో ఇప్పుడు అర్ధం అవుతుంది కదు......


చివరగా నాగేంద్ర కుమార్  గారు పూర్తి వివరణ తో  ఇలా
సెలవిచ్చారు. .............

"యతో అభ్యుదాయ నిశ్రేయ ససిద్ధిః స ధర్మః " ఏది అభ్యుదయ కారకమో ఏది మోక్ష సాధనమో లేదా మోక్షాన్ని సిద్ధింపజేయటంలో తోడ్పడుతుందో అదే ధర్మం.
అభ్యుదయం అంటే కేవల లౌకికం కాదు, నాకు లక్ష రూపాయలు వస్తున్నాయి కాబట్టి అది నాకు అభ్యుదయం అన్న వాదన అసంబద్ధం, అది మోక్ష కారకమైనదా అన్నది అవసరం.
ధర్మం అంటే తెలుసుకొని ఆచరించేది.

మానవుడు లౌకిక పార లౌకిక వ్యాపారాలాను నిర్వర్తించడానికి వేదం చెప్పిన త్రోవలే ధర్మాలు. ఆ ధర్మాచరణమే మోక్షానికి దైవ సాక్షాత్కారానికి మార్గం. ఒకే వ్యక్తికి ఒకే ధర్మం ఒకేలా అన్నివేళలా అన్ని దేశాలలో ఉంటుందన్నది సత్య దూరం.
నేను నాగురువుల దగ్గర ఉన్నప్పుడు నేను పాటించాల్సింది శిష్య ధర్మం. అలాగే నా తలి దండ్రుల దగ్గర పుత్ర ధర్మం, అదే సమయంలో నాపిల్లల దగ్గర నాది పితృ ధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం ద్వాదశి నాడు పారణ ( త్వరగా భుజించడం) ధర్మం. అదే ఏకాదశి నాడు ఇక్కడ ఉంటే ఉపవాసం ధర్మం, కాశీలో ఉంటే అన్నపూర్ణ అనుగ్రహంగా ఉపవాసం ఉండకపోవడం ధర్మం. కొన్ని మాసాల్లో సముద్ర స్నానం నదీ స్నానం ధర్మం కొన్ని మాసాల్లో నిషిద్ధం. ఇలాగే చాలా మారుతూ ఉంటుంది.
అలాగే వర్ణాశ్రమాలలో కూడా, బ్రహ్మచారికి ఉన్న ధర్మం వేరు అదేబ్రహ్మచారి వివాహం చేసుకుంటే పాటించాల్సిన గృహస్థ ధర్మాలు వేరు అలాగే సన్యాసికీ వానప్రస్తుకీ... ధర్మం మారడం అంటే ఒకే వ్యక్తికి దేశ కాల అవస్థ వర్ణ ఆశ్రమాదులని బట్టి మార్పు చెందుతుంది. అదే ఇద్దరు వ్యక్తులు ఒకే దేశ, కాల, ఆశ్రమ, వర్ణ, అవస్థాదులలో ఉంటే ఇద్దరికీ ఒకే ధర్మం ఏ ఒక్కటి మారినా ధర్మం మారుతుంది.... స్థూలంగానీ సూక్ష్మంగానో....
ధర్మ శాస్త్రాల వాఖ్యానాలు చదివి గురువుల వద్ద నేర్చుకొని అనుష్టించడమే ఉత్తమం. అంతా కాకపోయినా కొంత మన ప్రస్తుత జీవన సరళికి కావల్సిన ధర్మ సూక్శ్మాలు తెలుసుకొని ఆచరించడం శ్రేయస్కరం, మోక్ష ప్రదం.
నాకు ధర్మం తెలుసు ఏది చేయాలో ఎలా చేయాలో తెలుసు కాని చేయను అంటే అది నా ధర్మమును నిర్వర్తించడము కాదు నేను ధర్మాత్ముడను కాను. లేదా ధర్మ సూత్రములను నాకు ఇష్టం వచ్చినట్టు అన్వయించుకోవడం కూడా ధర్మాచరణము కాదు.
ధర్మం గురించి రాస్తూ ధర్మ పరాయణుడైన రాముని తలచుకోకుండా ఎలా ఉంటాం. రామాయణం అంతా ధర్మాచరణమే దానిని ధర్మాయణం అనచ్చేమో. ఇక అంత స్థాయిలోనివారు హరిశ్చంద్రుడు, భీష్ముడు, ధర్మ రాజు, ఆది శంకరులు మొదలైనవారు.
ధర్మం అనేమాట సనాతన ధర్మం లోనిదే దానికి ఇతర ఏ భాషలోనైనా పర్యాయ పదంలేదు. ఆంగ్లేయులే తత్సమాన పదం వారి భాషలోలేక వారు మాట్లాడేటప్పుడు వారి వాజ్ఙ్మయంలోనూ "Dharma" అనే వాడారు.
 
ఇక ధర్మాన్ని పట్టుకుంటే ఒరిగేది ఉత్తరదిశా ప్రయాణమే.. ధర్మాన్ని పట్టుకున్న రాముడు ఉత్తర దిశగా పుష్పకం ఎక్కి ధర్మాన్ని పట్టుకున్న వారినందరినీ పుష్పకం ఎక్కిమ్చుకున్నాడు, ఎంత మంది ఎక్కినా అందులో మరొకరికి స్థానం ఉంటుంది. ధర్మాన్ని పట్టుకుంటే రాముని పుష్పకంలో ఎక్కగలం ఉత్తర దిశా ప్రయాణం చేయగలం ఎవరూ భేధించలేని మోక్ష సామ్రాజ్యాన్ని పొందగలం (అయోధ్య / కైలాసం). వదిలేస్తే రావణునితో కూడి దక్షిణాపథంలో ప్రయాణించి, పుట్టుక చావులమధ్య ఎంకా ఎన్నో దురవస్థలమధ్య తిరుగుతూనే ఉంటాం.
ధర్మో రక్షతి రక్షితః అంటే నీ ధర్మాన్ని నువ్వు ఆచరించటమే ధర్మ రక్షణం. గీతా చార్యుడు కూడా ఇదే అంటాడు. స్వధర్మమే శ్రేయస్కరం పరధర్మం భయంకరమైనది. బ్రహ్మచారి బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి కాని గృహస్థు ధర్మాన్ని కాదు అలానే గృహస్థు గృహస్థు ధర్మాన్ని అలా......... రాజ ధర్మాన్ని రాజు, సేవక ధర్మాన్ని సేవకుడు అలా.... కాకుండా ఒకరి ధర్మాన్ని ఒకరు విస్మరించి ఇంకొకరి ధర్మాన్ని అనుసరిస్తే కలిగే పరిస్థితి అతి గందరగోళం ( ప్రస్తుతం ఉన్న స్థితి అదేనేమో" .............

చదవరులు ఈ ప్రయత్నాన్ని ఆమోదించి ధర్మం గురించి మనకు తెలియని విషయాలను గ్రహించి పాటిస్తారని ఆశిస్తూ  .......... మీ విధేయురాలు............

కామెంట్‌లు

 1. ప్రకృతి ఈశ్వర నియతికి లోబడి నడుస్తున్నది
  గుణములు వాటి ధర్మాన్ని అనుసరిస్తూ వర్తిస్తున్నాయి
  ఇంద్రియాలు అంతే వాని ధర్మం ప్రకారం వర్తిస్తాయి
  అయితే అవేవి మనం కామని గుర్తించి ఆత్మ గా ఆత్మ భావనతో వర్తిన్చటమే మన ధర్మం
  "ఆత్మ ధర్మం" శరణం గచ్చామి

  http://paramapadasopanam.blogspot.com/

  రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా....

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...