నా మనోగతం

అందరికి నా నమస్కారాలు.. నా మనసు కలతతో నిండి వుంది.. అది అలా వుండకూడదని తెలుసు .. ఎందుకంటే కష్టాలని కూడా సుఖంగానే తీసుకుంటాను కాబట్టి...కాని....ఈ నాటి నా పరిస్థితి వేరు.....అందుకే నా ఈ పరిస్థితిని మీకు వివరించాలని......
..................
 అమ్మ మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళేది..  భర్త ,5గురు పిల్లలు, తన తమ్ముడు, అడపడుచు కుమారుడు.... ఇంతమందికి వంటలు చేస్తూ...పూజలు, పండగలు, తెల్లని మేని చాయతో ఒక పద్దతిలో........
తన తల్లి తన 5 సంవత్సరాల వయస్సులో గతిస్తే, తండ్రి తనకి మొదటి సంతానం కలిగిన తర్వాత కాలగతి చెందారు.. నాన్నగారి తరపు వారితో ఇమిడీ , ఇమడలేక, భర్త దగ్గర మాత్రమే తన కోపతాపాలు, తన గురించి నాకు అంతకుమించి తెలిసే అవకాశం లేదు. కారణం ఒక్కటే....నా మౌనం....ఆ మౌనంలో ఏ భావాలూ వుండేవి కావు.ఏ ఆలోచనలూ వుండేవి కావు. పుస్తకం ఒక్కటే వుండేది.. ఏ పుస్తకమైనా, ఒక చిరిగిన కాగితమైనా దానిలోని అక్షరాల వెంట మాత్రం నా కళ్ళు పరుగులు తీసేవి. . అమ్మా అని పిలిచిన గుర్తులేదు. ఆకలి అని అడిగిన గుర్తులేదు. . నా పని నేను చేసుకుంటూ పెట్టినది తినడం గుర్తుంది.. ఎవరైనా మొహంలో లక్ష్మి కళ వుంది అన్నపుడు ఒక చిరునవ్వు మాత్రం గుర్తుంది.. నువ్వు డాక్టర్ చదవాలి అని అమ్మ చెప్పడం గుర్తు.
హిందీ చదవమని ప్రోత్సహించిన గుర్తు.  ఎన్.సి.సి. కాంప్ లకు వెళ్తానంటే ప్రోత్సహించిన గుర్తు.. అయ్యో పాపం అని జాలిగుండె కలదని తెలుసు.  అమాయకురాలు అని తెలుసు.. 18 సంవత్సరాల వయసులో నాకు నాన్నగారు పెళ్ళి చేస్తానని అన్నీ తయారు చేసుకుంటున్న సమయంలో నన్ను అన్నయ్య మద్రాసు నుండి ముందుగా తీసుకు వచ్చినపుడు ఇంట్లో పెళ్ళి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.  నేను రాగానే నన్ను పెళ్ళికూతుర్ని చెయ్యడం, పెళ్ళి, అన్నీ కలలో జరిగినట్లు జరిగిపోయాయి.  అందువల్ల అమ్మ మనసు, అమ్మ అన్నపదానికి అర్ధం అనుభవించని స్థితి.. ఏమీ ఆశించని గుణం వల్ల అమ్మ దగ్గర్నుండి పసుపు కుంకుమ కూడా ఆశించలేదు.. నా భర్త చెప్పినట్లు చెయ్యడం, మా అత్తగారు ఈ చీర కట్టుకోమ్మా అంటే వారి మాటకు విలువనిచ్చి ఆ చీరే కట్టుకోవడం.. ఇలా సాగిన నా జీవితం (సహజంగానే ఏదో పిరికితనం నన్ను ఆవరించుకుని వుండేది. అది ఏమిటో ఇప్పటికీ తెలియదు.. అనుకోకుండా నా భర్త వల్ల జరిగిన ఒక చిన్నపొరపాటు నన్ను ఇంకా పిరికిదానిగా తయారు చేసింది. (భగవంతుని ముందు నిలబడినా నాలో ఏ భావమూ కదలాడేది కాదు. అటువంటి నాకు ఒకరు షిర్డీ సాయి బాబా విగ్రహం తెచ్చి నా చేతికి ఇచ్చినపుడు జీవం ఉన్న మనిషి లా బయం వేసి బీరువాలో దాచి, తర్వాత ఎప్పుడో పూజగదిలో సింహాసనంలో పెట్టాను.. ) టి.వి లో బాబాకి అభిషేకం చూస్తూ, ఏదో భయంతో టి.వి. కట్టేసిన నేపధ్యం నాది..అటువంటి నా నోట అప్రయత్నంగా వచ్చిన "బాబా" అన్న పిలుపు హృదయంలో మారుమ్రోగసాగింది. ప్రతిక్షణం అదే నామ స్మరణ.. చివరకు నిద్రలో కూడా..అది ఒక తపస్సులా మారిందని నాకు తెలిసే సరికి నాలో ఏదో మార్పు.. ఏవేవో అనుభవాలు.. అది సహజసిద్ద రాజయోగం అని అలానే కొనసాగనీయమని నాకు కొందరు తెలియజేసారు ఒక వేద పండితులు..  క్రమేణా నాలో మార్పులు నన్ను నిలువనీయక పూర్తి మౌనం కావాలన్న కోరిక తీవ్రమౌతున్న సమయంలో బలవంతంగా నన్ను నేను నిలవరించుకుని వుండడానికి చేసిన ప్రయత్నం  నన్ను చాలా ఇబ్బందుల పాలు చేసినప్పటికీ, నా చుట్టూ వున్న బంధాలకు సంబందించిన భాద్యతలు పూర్తి కానిదే నేను మనశ్శాంతిగా వుండలేను అన్న నిజం నన్ను నిలదీసింది..
ఈ సమయంలో నాన్నగారు మరణించిన రెండు సంవత్సరాలకు మనశ్శాంతి కరువైన అమ్మ, చెల్లి నా దగ్గరకు వచ్చారు..(అంతకుముందు నాన్నగారి వునికి నాకు తెలిసేది.. అమ్మకు ఏదైనా తేడా చేస్తే ఆయన నా దగ్గరకు వచ్చేవారు)..అమ్మని ఒక సాధువులా చూడాలని ఆశించిన నేను తనలో కొన్ని మార్పులు, కొన్ని కోరికలు గమనించి ఆశ్చర్యపోయాను.. ఒంటరిగా తనకు నచ్చినట్లు వుండాలని, గుళ్ళూ, గోపురాల దర్శనం చేసుకోవాలని, పెద్దకుమారుని దగ్గరే వుండాలని, ఇంకా బ్రతకాలని......... ఒంట్లో ఓపిక లేక కొంత, పెద్ద కోడలి మాటలు, పట్టించుకోని పెద్దకొడుకు, ఆస్తి అప్పగిస్తేనే చూస్తానన్న పెద్దకొడుకు, అల్లుడూ దగ్గర వుంటే నలుగురూ ఏవో అంటారనీ...ఇలా నలిగిపోతూ, ఆ కోపం నామీద చూపించడానికి జరిపే ప్రయత్నాలకు నేను నా మనసులో " ఏమిటిది, ఇలా జరుగుతుంది? మంచి చేస్తానంటే ఇలా ఎందుకు జరుగుతుంది" అని నన్ను నేను విశ్లేషించుకుని ఆ రోజే నిర్ణయించుకున్నాను " ఆమె నాకు అమ్మ కాదు.. నా కూతురిలా చూసుకోవాలి " అని. ... ఆనాటినుండి పూర్తి అనారోగ్యం పాలు ఐన అమ్మ వెంటే వుండి నీడలా కనిపెట్టుకుని వున్నాను.
చిన్నపిల్లకు చేసినట్లే సేవ చేసాను..పూర్తిగా 51/2 నెలలు..  అన్నం తినిపించేటపుడు మా అమ్మవు కదు వద్దు అన్నా బ్రతిమాలి తినిపించిన నేను, ఏమీ అవదు, తగ్గిపోతుంది అని ప్రతిక్షణం బుజ్జగించిన నేను ఆమె పడే నరకయాతన చూడలేక, " బాబా ఆమెను నీ దగ్గరకు తీసుకు వెళ్ళిపో.. నీ కూతురిలా దరిచేర్చుకో" అని ప్రార్ధించే దానిని.. అది తప్పో,ఒప్పో తెలియదు... ఆమె ఆరోగ్య స్థితి పూర్తిగా చేయిజారిపోయిన తర్వాత విజయవాడలోని నాగార్జున హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం జరిగింది.. 6 రోజులు ఈరోజు, రేపు అనుకున్న ఆమె గురువారం రధసప్తమి రోజు మధ్యాహ్నం అందరూ నన్ను భోజనం చెయ్యమన్నా చెయ్యకుండా అమ్మ దగ్గర వుండిపోయాను.. మధ్యాహ్నం నుండి అమ్మ బి.పి. బాగా తక్కువై తిరిగి కోలుకోని స్థితికి వెళ్ళిపోయినప్పుడు "నేను నీ దగ్గరే వున్నాను. నీకు ఏమీ జరగదు" అని అంటూనే నా మనసులో " బాబా" అని ప్రార్ధించసాగాను.. ఆమె పడే బాధ చూడలేక ఒక ప్రక్క, బ్రతికితే ఆమెకు నరకయాతన అన్న భావన మరో ప్రక్క.. అయోమయస్థితి.. చివరకు ఆమె అవసాన దశకు చేరినప్పుడు డాక్టర్లు అందరినీ బయటకు పంపించివేసినా, నా మనసు ఆమెను ఒంటరిగా వదలలేక ఐ.సి.యూ లోపలికి వెళ్ళి ఆమె నుదుటిమీద చేయి వేసి వుంచాను..కళ్ళు మూతలు పడిపోయి కేవలం వూపిరి తీస్తూ వదులుతున్న ఆమె నోరు ,నాలికలను గమనిస్తూ తనకు తోడుగా నిలబడిపోయాను.. చివరి శ్వాస వరకూ తన నుదుటిమీద నా చేయి వుంచాను ...నిదానంగా బయటకు వచ్చినప్పటినుండీ నాలో ఏదో భావన.......... "ఎక్కడ బ్రతికి బయటకు వస్తుందో అని బయం వేసి నేను ఆమె చివరి శ్వాస వరకూ వుండిపోయానా "  అని... నాలో ఏదో దు;ఖ్ఖం...... "తప్పు చేసానా".. అని..
ఏదీ మన చేతుల్లో వుండదు అని తెలుసు. కానీ ఏం జరిగింది? ఎందుకిలా జరిగింది అన్న ప్రశ్న..
ఆమె నా చేతులమీద పోవడం వ్రాసిపెట్టి నా దగ్గరకు వచ్చిందా అని ప్రశ్న.. కళ్ళుమూసినా, తెరిచినా చివరి క్షణంలో అమ్మ తీసుకుంటున్న వూపిరి నా ముందు నిలుస్తుంది.....  భగవంతుడు ఆమెకి సేవ చేసే అదృష్టాన్ని కల్పించాడని మురిసిపోవాలా లేక ఇలా జరిగింది ఏమిటి అని విచారించాలా.....  . అమెకి ఏది జరిగినా నేను సాయంత్రం భోజనం చేస్తానులే అని సమాధానం ఇచ్చేదాన్ని నన్ను బలవంతం చేసిన ప్రతిఒక్కరికీ.. అన్నట్లు గానే ఆ సాయంత్రం అన్నయ్య ఇంటికి అమ్మ పార్ధీవ శరీరాన్ని తీసుకువెళ్ళిన తర్వాత
భోజనం చేసాను... నన్ను ఏమంటారు ? 

కామెంట్‌లు

 1. మిమ్మల్ని ఏమి అనరు మీ బాద్యత మీరు చేసారు....కొంత మంది చేయలేని పని మీరు చేసారు....అమ్మకు చేయగలిగినది చేసారు......

  రిప్లయితొలగించండి
 2. నిన్న పోస్టు చూడగానే ఒక కామెంట్ రాసాను అది ఎందుకు రాలేదో తెలియదు..మీరు చేసినది అమ్మకు శాంతి కలిగించేదే తప్ప మరోటికాడు.మనం ఎప్పుడూ మన consious బట్టి పోవాలి అంతేనండి. మన మనసుకు సంతృప్తి నివ్వాలి.

  రిప్లయితొలగించండి
 3. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  రిప్లయితొలగించండి
 4. అందరికీ నమస్కారం..నా ధన్యవాదాలు కూడా.. అమ్మ అనారోగ్యం, ఆమె అకాలమరణంతో నేను మిమ్మల్ని పలకరించలేకపోయాను...ఆలస్యానికి మన్ననలు కోరుతున్నాను..

  రిప్లయితొలగించండి
 5. chaala roju laindi...emiti mee mounam...badhapadutunnara inka? kaalam anni maripistundi...malli maa prapanchamloki randi...inka adhyatmika vishayalu rayandi please!!!

  రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

స్నేహంలో రకాలు

నాన్న మాట అమ్మకి వేదం