ఈ కాలం పిల్లలు కేవలం ఒక భర్తగా లేక ఒక భార్యగా వుండాలని అనుకోవడం లేదు. మరి ఏం కోరుకుంటున్నారు??

మనకి మనం సంప్రదాయాలు విదించుకున్నాము. . . మన సంస్కృతి దేశ విదేశాలకి తెలియజేశాము..ఇతరులు మన దేశవిలువలను అనుసరిస్తున్న సమయానికి మనం వింతపోకడలు పోతున్నాము. ఇంతవరకూ అందరూ ఆమోదించే విషయమే... ఐతే ఇంకా ఏదో తెలియనిది తెలియజేస్తున్నారు మన పిల్లలు..

  ఇదివరకు టెక్నాలజీ అభివృద్ది లోనికి రాని సమయంలో ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్న సమయంలొ, ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఇంట్లో ఒక్కరు సంపాదిస్తే పదిమంది కూర్చుని తినే స్థితిలో సహజంగానే పెద్దవారు అంటే వయసు పైబడిన వారు తమ శక్తి సామర్ధ్యాలు తగ్గిన తరువాత పిల్లల సేవలపై ఆధార పడి ఉండేవారన్నది అందరికీ విధితమే...ఉద్యోగరీత్యా కానివ్వండి లేదా అన్నదమ్ముల కుటుంబాలలో ఒకరికొకరికి సరిపడక కానివ్వండి లేదా పిల్లల భవిష్యత్ దృష్ట్యా, ఒక ఊరినుండి ఇంకో ఊరికి బదిలీ వెళ్ళే సమయంలో పెద్దలు తాము పుట్టి పెరిగిన ఊరిని విడిచి వెళ్ళలేక ఆక్కడే ఉండిపోవడం వల్ల(ఈనాడు ముందు జాగ్రత్తగా పిల్లల పెళ్ళిళ్ళు చేసిన వెంటనే వారిని విడిగా ఉంచి వారికంటూ ఒక కుటుంబం ఏర్పాటు చేస్తున్నారు పెద్దలు) చిన్న చిన్న కుటుంబాలు ఏర్పడడం జరిగింది...ఒక కుటుంబం అంటే అమ్మ,నాన్న, ఒకరు లేక ఇద్దరు పిల్లలు..అమ్మనాన్నలు ఇద్దరూ సంపాదిస్తున్న కుటుంబాలూ ఎక్కువ ఉన్నాయి..ప్రభుత్వ వుద్యోగులు మాత్రమే తమ జీవితాలకు భద్రత ఉందని భావించేవారు..

 కాని ఈనాడు పెరిగిన టెక్నాలజీ మంచి  ఉద్యోగావకాశాలను అందిస్తుంది..ప్రైవేటు సంస్థలు కూడా తమ ఉద్యోగులకు అన్నివిధాలా చేయూతనివ్వడంతో వారికి అభద్రతా భావం పోయి తమ జీవితాలకు మంచి
 పునాదులు వేసుకుంటూ ఈరోజు పిల్లలను చదివిస్తూ,వారు సెటిల్ అయ్యేంతవరకూ చేయూతనిస్తూ
తాము పిల్లలపై ఆధారపడి ఉండని పరిస్థితిలో హాయిగా జీవించే ఏర్పాటు చేసుకుంటున్నారు..

ఈనాటి మన పిల్లలు కేవలం చదువులమీద మాత్రమే కాక తమ భవిష్యత్తుని బంగారు భవిష్యత్ చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు.అవసరమైతే పెద్దలకు తమ సలహాలు కూడా ఇచ్చే స్థితికి
ఎదుగుతున్నారు.. ఇటువంటి పరిస్థితిలో నేను అప్పుడప్పుడు వారి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించసాగాను..అందమైన, ఆరోగ్యకరమైన ఆలోచనలు ఆందోళన కలిగించవు గాని, ఒకోసారి విచారం కలుగుతుంటుంది..." భవిష్యత్తులో ఎలా ఉంటుంది " అన్నది ఊహకి అందని విషయమా...

ఉద్యోగ అవకాశాలు మగపిల్లలతో సమానంగా ఆడపిల్లలనీ వరిస్తుండడంతో ఆడవారిలో అభద్రతాభావం పోయి,శారీరికంగా బలహీనురాలు అని భావించి "అబల" అని అనిపించుకున్న నోటితోనే "ఆమె లేని జీవితం
అసంపూర్ణం" అని తెలిసేలా చేయడం,,తెలుసుకున్న మగవారు స్త్రీకి విలువ ఇవ్వడం.. గమనార్హం..

ఈ నేపధ్యంలో పరిస్థితుల ప్రభావానికి లోనై ఒత్తిడికి గురి అవుతున్న పిల్లలు తమ జీవితాలను ఆనందమయం చేసుకోవాలని తాపత్రయపడుతున్నారు..ఆనాటి కుటుంబ సినిమా కథలను లేదా మన పురాతన సంప్రదాయాలను వారిముందు పెట్టాలని ప్రయత్నం చేసే తల్లిదండ్రులు విఫలం చెందుతున్నారనడంలో అతిశయోక్తి లేదు..వారికిప్పుడు తల్లిదండ్రుల్లా చీటికి మాటికి పోట్లాడుకోవాలని అనిపించడం లేదు....తమ జీవితాల్లో ఏమాత్రం విషాద గడియలు ఆహ్వానించే స్థితిలో వారు లేరు...ఈ క్షణం పోతే తిరిగిరాదు అన్న సత్యాన్ని తమకు అనుగుణంగా మార్చుకుంటున్నారు... ప్రతి క్షణం తమకు నచ్చిన రీతిలో ఆనందంగా వుండాలని ఆరాటపడుతున్నారు


ఈ పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఆడవారు కానివ్వండి,మగవారు కానివ్వండి, క్రొత్త తరానికి ఆహ్వానం పలుకుతున్నారు.. ఒకరికొకరు సన్నిహితంగా మసలుతున్నారు..   "ఒసే", "ఏమే" అన్న పిలుపులకు దూరంగా  "అరే", "ఏరా" అనే పిలుపులతో ప్రేమను తెలుపుకుంటున్నారు... చివరకు పెళ్ళి కాకుండానే భార్యా,భర్తల్లా వ్యవహరిస్తున్నారు....పెళ్ళికి విముఖత చూపిస్తున్నారు... భయపడుతున్నారు..స్వేఛ్ఛాపూరితమైన జీవితం కోరుకుంటున్నారు...తమకి నచ్చినట్లు వుండాలనుకుంటున్నారు...అంతవరకూ బాగానే వుంది.. కాని, ఇదే విధంగా సాగితే..... ??????????  ప్రశ్న వరకూ బాగానే వుంది...జవాబు మీకే వదిలేస్తున్నాను...  

కామెంట్‌లు

  1. మీరు చెబుతున్నది ఒక చిన్న క్లాస్ కి పరిమితం. అదేంటంటే - Urban/ Metropolitan educated middle class or upper middle class. మిగతా ప్రజానీకం ఇంతకు ముందులాగానే ఉంది. ఎందుకంటే ఈ దేశ ఉపాధిరంగం యావత్తూ సర్వీస్ సెక్టార్ మీదనూ, అథవా వ్యవసాయరంగం మీదనూ ఆధారపడి ఉంది. ఇక్కడ మ్యాన్యూఫ్యాక్చరింగ్ సెక్టార్ పెద్దగా ఏమీ లేదు, చైనాలో ఉన్నట్లు, యూరప్/అమెరికాలలో ఉన్నట్లూ !

    మీరు చెబుతున్న ఆశావహ పరిణామాలు తాత్కాలికమే, తుఫాన్ ముందు ప్రశాంతిలాంటివి అని నేనంటే నన్నొక శకునపక్షిగాడని భావించరు గదా ? ఎందుకంటే మ్యాన్యూఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెద్దగా మన దగ్గఱ లేకపోయినా సాంస్కృతికంగా మన దేశం యూరప్, అమెరికాల బాటలో ప్రయాణిస్తూంది. వారికీ, మనకీ మధ్య ఒక 30 - 40 ఏళ్ళ వార. అంతే. అంటే ఆ లోపల ఇక్కడ కూడా కుటుంబవ్యవస్థ కుప్పకూలుతుంది. మనుషులు ఒకరి మీద ఒకరు ఏదో ఒక రకంగా ఆధారపడినంత కాలమే ఈ వ్యవస్థలు నిలబడతాయి. ఆ అవసరం లేకపోయాక ఎవరి దారి వారిది.

    ఈ పిలుపులు ఇదివరకటిలా లేకపోవడానికి కారణం ఇంగ్లీషు మీడియమ్ అనుకుంటా. అయితే "ఒసే" అనడం,లో ఉన్న అగౌరవం ఏంటి ? "ఏరా" అనడంలో ఉన్న గౌరవం ఏంటి ? నాకేమీ అర్థం కాలే. మొదటిది ఆడపిలుపు. రెండోది మగపిలుపు. కాబట్టి ఆడపిలుపులన్నీ అవమానకరం, మగపిలుపులన్నీ గౌరవనీయం అనే అభిప్రాయం ధ్వనిస్తోంది. నాకు తెలిసి ఇది ఫెమినిస్టుల ధోరణి. వాళ్ళ దృష్టిలో feminity అంతా అవమానకరమైనది, చెత్తలా తీసి అవతల పారేయదగినది. Masculinity యే గౌరవనీయమైనది. ఆడవాళ్ళకి ఆడతనం శోభనిస్తుందని వారు అంగీకరించరు. గౌరవానికి నోచుకోవాలంటే ఆడవాళ్ళు ముమ్మూర్తులా మగవాళ్ళలాగానే ఉండాలని వారి సిద్ధాంతం.

    రిప్లయితొలగించండి
  2. ఇన్ని మంచి భావాలనడుమ వారు మనోస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతున్నారోకూడా వివరించిఉంటే బాగుండేది....వోసె/ఏమే పిలుపులో అనురాగం ఆప్యయతలు లేవంటే నే వోప్పను సుమా..ఏమండి/మిమ్మల్నే అనే సంభోధనలోను అదే మాధుర్యం కన్పిస్త్తుంది నాకయితే

    రిప్లయితొలగించండి
  3. అమ్మా
    అసలికి ఈ రోజుల్లో పిల్లలని ఎవరైనా వ్యక్తిత్వం ఉండేలా పెంచుతున్నారా? ఎంత సేపటికి చిన్నప్పటి నుంచి చదువు ఆ తరువాత ఉద్యోగం రావటం. అక్కడ చేరటం అది చూసిన తల్లిదండృలు వారేదొ చాలా తెలివిగల వారని అనుకొంట్టున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలం లో కొంతమంది తల్లిదండృలకన్నా పిలల్లల కి ఎక్కువ జీతాలు వస్తున్నాయి. ఇక డబ్బు వచ్చిన తరువాత సహజం గా మనిషి కి కొన్ని తెలివి తేటలు వస్తాయి, స్వార్థం బాగ పెరుగుతుంది. వారు పెద్దలకు ఇచ్చె సలహాలు లేక పెద్దలు వారి దగ్గర నుంచి ఆ వయసులో తీసుకొనే సలహాలు ఎముంటాయి ఏ ఇల్లు ఎక్కడ కొనాల్,ఇ ఎప్పుడు కొనాలి, ఎలా డబ్బును దాచు కోవటం అని తెలుసు కోవటం తప్ప. లేక పోతే నేను ప్రేమించిన వారినే పెళ్ళి చేసుకొంటాను అని అంటే ఎలాగు ఇద్దరు పని చేస్తున్నారు. కనుక పెద్దలు వారి ప్రేమను అంగీకరించి పెళ్ళి చేస్తారు. నెల నెలా మంచి జీతం వస్తూంటే, జీవితం సాపీగా సాగుతుంటే అంత గొప్ప విజేతలు లా గా కనిపిస్తారు. అలా ఎప్పుడు విజయమార్గం లో జీవితం ప్రయాణిస్తే అది జీవితం ఎందుకు అవుతుంది? కొన్ని కష్టాలు వచ్చినప్పుడు ఇటువంటి వారి జీవితాలు గురించి మనకు అర్థమౌతాయి. కొంతకాలం వేచి చూడండి అన్ని రంగులు వెలిసిపోతాయి.

    రిప్లయితొలగించండి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం