నీ నవ్వే చాలు  
 అమ్మ నవ్వింది ... ప్రతి క్షణం  ఆ నవ్వు గుర్తు వస్తుంది..
 అది అలౌకిక మైన నవ్వు.
ఎలా సాధ్యమైనది అని ఇప్పటికీ సందేహమే..
.టివి చూస్తూనో లేక ఎవరైనా జోక్ చెప్తే నే గాని నవ్వలేని స్థితిలో వున్నాము మనము..
కాని, అమ్మ నవ్వు ఇప్పటికీ  ఆశ్చర్యమే...  నువ్వు ఏమి కోరుకుంటున్నావు అంటే అదే కోరుకుంటున్నాను అని చెప్తాను..    ఎందుకీ  ఉపోద్ఘాతం అంటారా ?   అసలు  విషయం లోకి వస్తాను..  .మొన్నీ  మధ్య ఒకసారి మా మామ గారు ఏ విషయం లోనో భయపడుతున్నారు   అనిపించింది నాకూ,  మా బాబుకి.   నేను మేడ పైన వుండగా మెల్లగా నా దగ్గరకి వచ్చి ఏదో మాట్లాడుతూ " అమ్మా, తాతయ్యని గమనించావా   ఈ మధ్య ".... అని అడిగాడు.   "నిజమే నాన్నా, ఏదో భయం కనబడింది నాకు. నా సందేహమే గనక నిజమైతే ఆ విషయంలో నేను కౌన్సిల్ చేస్తాను.   అసలు విషయం  కనుక్కోనీ .. డోంట్  వర్రీ ".. అని చెప్పాను.  .ఒక కారణం నాకు తెలిసినదే ...ఈ  మధ్య మా అత్తగారు, ' ఆయనకి  వయసై పోయింది'   అని పదే పదే  అనడం నేను విన్నాను . కారణం, ఇద్దరి వయస్సుల మధ్య అంతరం ఎక్కువ వుండడం అని తెలుసు.    మా దగ్గరకు వచ్చే ముందు ఆయనని ఒకరోజు (కొన్ని ఆరోగ్య కారణాల వల్ల, గుండెల్లో దడ రావడంతో  ) హాస్పిటల్ లో వుంచారు...  బహుశా ఆ రోజు నుండి మా అత్తగారు తనని తను మెంటల్ గా ప్రిపేర్ చేసుకోవడం కోసం కావచ్చు, లేదా పెద్ద వయసు కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగా వుండాలని హెచ్చరిక కావచ్చు, ఆమె అలా అనిన ప్రతీసారి ఆయన వులిక్కి పడడం, ఆహారం విషయంలో అతిగా జాగ్రత్త పడడం గమనించాము. ఆయన వయస్సు తొంభై ఆరు సంవత్సరాలు అని చెప్తారు .. ఇప్పటికీ పళ్ళు గట్టిగా వుంటాయి. నేను అదే చెప్తాను.  అంతటి  ఆరోగ్యం తనకి వుండడం ఎంతో అదృష్టం అని.... ఎన్నిసార్లో అనుకున్నా పెద్దవారు అన్న గౌరవమే కాక రాముని ముందు కుప్పి గంతులా అని సైలెంట్ గా వుండడం జరిగింది ...అదేమిటి కోతి ముందు అనాలి కదా అంటారా ...  ఆయన రాముని భక్తులు ..  పేరు కూడా అదే..  ఖాళీగా వుంటే రామదాసు కీర్తనలు పాడుకుంటారు ....  సమయం ఆసన్నమైంది  అని మెల్లగా దగ్గరకు వెళ్లి  నెమ్మదిగా మాటల్లోనికి దించాను... నిదానంగా అడిగాను ------  "ఈ మధ్య మీలో ఎందుకో భయం కనిపిస్తుంది.. ఎందుకు భయపడుతున్నారు?  మీరెందుకు భయ పడుతున్నారు అన్నది నాకు అర్ధమౌతుంది.. కాని, మీనుండి  తెలుసుకుంటే బాగుంటుంది అని.ఎందుకంటే నేను కరెక్ట్ కాకపోవచ్చు"  ...  అని అన్నాను ....    .     "నిజ మే, బాగా  గ్రహించావు "   అన్నారు.. " సడన్ గా చనిపోతానేమో అని భయం"...అన్నారు.  నా సందేహం నిజమైంది ..ఆయన భయానికి తోడు  మా అత్తగారి మాటలు... వెరసి మానసికంగా భయానికి లోనవడం .....

ఐతే , మా అమ్మగారు నా దగ్గరకు వచ్చిన సమయంలో తను ఒంటరిగా వుండాలని, బంధువుల మధ్య వుండాలని, వారితో కలిసి పూజలకు, గుడులకు వెళ్లాలని నాకు చెప్తుండేవారు...కాని, తన ఆరోగ్య పరిష్తితి దృష్ట్యా  బొమ్మలా గాజుబొమ్మలా తయారయ్యారు... " అమ్మ ఎలా వున్నారు",  అని అడిగిన మా అత్యంత సన్నిహితులు, అమ్మ,నాన్న  తర్వాత వారి స్థానం లో మేము వున్నాము అన్న ఆదరణ ఆప్యాయతలు చూపించిన    వారికి నేను   ఇచ్చిన సమాధానం --------- " అమ్మకు ఇంకా బ్రతకాలని వుంది "... అని.   " నిజమే"  అన్నారు ఆమె. .  "సహజమే"  .... అన్నారు....  "వయసు   పెరిగే కొలది ఒక భయం ఏర్పడుతుంది.  ఏమవుతుందో అని. ఓపిక లేక పోయినా  ఇంకా బ్రతకాలని అనిపిస్తుంది. " అని చెప్పారు...   ఈ మాటలు నా మనసులో వుండిపోయాయి.. ఆ మాటలను దృష్టిలో పెట్టుకుని మామయ్యగారితో మాట్లాడడం మొదలు పెట్టాను. మామయ్యగారు వ్యవసాయం లో దిట్ట .. ఆయన భాషనే వుపయోగించాను.
" ఒక విత్తనం నాటినప్పుడు మనకు తెలుసు అది మొక్కగా పెరుగుతుంది అని.   మట్టిలో నాటి నీరు పోస్తాము. మొక్క వస్తుంది.  వృక్షంగా కూడా కావచ్చు.. పండ్లు ఇస్తుంది. పూలు ఇస్తుంది. ఆకర్షణగా నిలుస్తుంది...అన్ని విషయాల్లో ఉదాహరణగా, ఎంతో ఉపయోగకరంగా వుంటుంది. కొంత కాలానికి అక్కడక్కడా కొమ్మలు,రెమ్మలు వడలడం మొదలౌతుంది... కత్తిరిస్తాము...  అయినా మొక్క  బ్రతికే వుంటుంది కాబట్టి పోషిస్తాము. దాని నుండి వచ్చే పదార్ధాల మీద ఆధారపడతాము..చివరకు మరి కొంత కాలానికి మొక్క పూర్తిగా వడలడం మొదలౌతుంది..
పూర్తిగా వాడిపోయిన తర్వాత పీకి అవతల పారేస్తాము.  కారణం,  వేరు నుండి దానికి జీవం పోయింది... అదే    విధంగా మనం పుట్టడానికి భీజం పడుతుంది. పుడతాము. పెరుగుతాము... ఏ కారణం చేత ఈ జన్మ తీసుకున్నామో ఆ కారణాలను పూర్తి  చేస్తాము..  సంతానం అనే పూలను, పండ్లను పూయిస్తాము.  మన శరీరం లోని భాగాలు వివిధ కారణాలతో వడలడం మొదలౌతుంది. ఒక్కొక్కటిగా తీసి పారేస్తాము. అంటే, కాలు విరిగినా చేయి విరిగినా  ప్రాణం ఎక్కడికీ పోలేదు.
అది మనసుని  అంటి పెట్టుకుని వుంది...  మనసు పరమాత్మని  కోరుకుంది.. పరమాత్మ లో లీనమయ్యే సమయానికి ప్రాణం ఈ శరీరం అనే మొక్క నుండి వేరు చేయబడుతుంది.   ప్రాణం లేని  ఈ శరీరం   కట్టెగా మారుతుంది. కట్టే అంటే మరో అర్ధం చెక్క లేదా కర్ర అని ..కట్టెలు ఐతే భూమిలో కలుస్తాయి లేదా అగ్నికి ఆహుతి అవుతాయి.  వెరసి ఇదీ జీవితం .. మొక్క లోని జీవం మనలోని ప్రాణం ఆత్మస్వరూపం ... శరీరం   మాయ , ఆత్మ నిజం.... దీనిని బట్టి అర్ధం చేసుకోండి మనం దేనికి భయపడాలో ........"----అని చెప్పాను. నా మాటల ప్రభావం తన తరువాతి దిన చర్యలలో నాకు అర్ధమైంది....
నిజమే .....మామయ్యగారికి చెప్పాను.  బాగానే వుంది.. మరి నేను ? అనుకున్నాను .
 ఆరోజు నుండి నా మనసులో అదే  ప్రశ్న .. పిల్లలకు చెప్తుంటాను. మీరు సెటిల్ ఐపోతే, నన్ను గురించి మీరు ఆలోచించే రీతిలో వుండను..  మౌనం అయిపోతాను అని..  సృష్టిలో అన్నిటికన్నా నాకు అత్యంత ప్రీతికరమైనది అదే.. ..
అప్పుడు అనిపించింది. సమయం మించిపోయింది అని అమ్మని ఐసియూ లో అన్ని రకాల machines మధ్య వుంచినప్పుడు కోమా నుండి తెలివి వచ్చిన అమ్మ నవ్వింది... ఆ నవ్వు ఆ సమయంలో .. మాకు అద్భుతం ..
అదే కావాలి .... అదే కావాలి...

ఓం సర్వలోక చారిణే  నమః ............ హనుమ మంత్రం. ఎన్ని కష్ట నష్టాలు, సమస్యలూ ఎదురైనా, సీతమ్మ తల్లి జాడ కోసం వంద యోజనాల దూరం పయనించిన హనుమని స్మరిస్తూ ...

(పూర్వం మానవులు వేల సంవత్సరాలు జీవించేవారట.. అన్ని వేల   సంవత్సరాల లోనూ అన్నీ పుణ్య కార్యాలె చేసేవారట .. ఇప్పుడు మన ఆయుష్షు తగ్గిపోయింది ..ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు..)

వంద యోజనాల దూరం ---- వంద సంవత్సరాల  ఆయుష్షు  (అనుకుంటే)
కష్టాలు , సుఖాలు, సమస్యలు, సంతోషాలు అన్నింటిని అధిగమించి సీతమ్మ అనే పరమాత్మని(మోక్షాన్ని ) వెదుక్కుంటూ నవ్వుతూ వెళ్ళడంని మించిన   అదృష్టమా ?  

ఆ నవ్వు కావాలి అంటే ఎంత కృషి చేయాలి, ఎంత సాధన చెయ్యాలి అంటారా ? ఏమీ కష్ట పడక్కర లేకుండా మానవునిలా సహజంగా వుంటే  అన్నారు పెద్దలు.
 అమ్మ నిజంగానే కష్టపడలేదు. సహజంగా తన రీతిలో తను వుంది. చెడు చూడకుండా, ఆలోచించ కుండా, మాట్లాడకుండా, వినకుండా, ఎవరికీ చెడు చెయ్యకుండా .......
అందుకే అంత   అందమైన ,అలౌకిక మైన నవ్వు తో వెళ్ళింది.

ఏదైనా  సాధించాలి అంటే ఆ విషయం( విద్య కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు,మరేదైనా కావచ్చు ) గొప్పగా వుండాలి అంటారు పెద్దలు.   విశేషంగా వుండాలి అంటారు. మరి ఇదీ అత్యంత విశేషమైనది  అని నా అభిప్రాయం ..
 
   .
     
   

 
 ఆ అందమైన మార్గంలో పయనించ డానికి చేయూత మన మనసు...దానిని మన చేతుల్లో వుంచుకుంటే .........................

          

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

నాన్న మాట అమ్మకి వేదం

స్నేహంలో రకాలు