గీతా భవనము

గీతా మే చోత్తమం గృహమ్.......అని భగవధ్వాక్యము. అనగా "నేను గీతనాశ్రయించుకుని యున్నాను. గీత నా యొక్క నివాసగృహము" అని భావము. ఈ ప్రకారముగ గీతామాహాత్యమున గీతా గృహమును గూర్చి భగవానుడు తెలిపియున్నాడు.. ఆ గృహము యొక్క స్వరూప,స్వభావముల వివరము ఈ క్రింద తెలుపబడుచున్నది.
గీతా సౌధ వివరములు
నిర్మాత____ శ్రీకృష్ణపరమాత్మ
అలంకరణ కర్త___శ్రీ వేదవ్యాస మునీంద్రులు
ఆకారము___ మూడంతస్థులు గలది.
పునాది___అర్జున విషాదయోగము(ప్రధమాధ్యాయము)
మొదటి అంతస్థు___ 5 గదులు (2వ అధ్యాయము నుండి 6 వ అధ్యాయము వరకు)(సాంఖ్యయోగము, కర్మ యోగము, జ్ఞానయోగము,కర్మయోగము,సన్న్యాసయోగము, ఆత్మసంయమయోగము _అనునవి)
రెండవ అంతస్థు____ 6 గదులు (భక్తిషట్కము_ 7వ అధ్యాయము నుండి 12వ అధ్యాయము వరకు)(విజ్ఞానయోగము, అక్షరపరబ్రహ్మయోగము, రాజవిద్యారాజగుహ్యయోగము,విభూతియోగము,విశ్వరూపసందర్శనయోగము,భక్తియోగము..అనునవి)
మూడవ అంతస్థు___ 6 గదులు ( జ్ఞానషట్కము..13వ అధ్యాయమునుండి 18వ అధ్యాయము వరకు) క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగము, గుణత్రయవిభాగయోగము,పురుషోత్తమప్రాప్తియోగము,దైవాసురసంపద్విభాగయోగము,శ్రద్దాత్రయవిభాగయోగమ్య్, మోక్షసన్న్యాసయోగము...అనునవి)

నిర్మాణమునకు వలసిన సున్నము____కర్మ
" నీళ్ళు___ భక్తి
" ఇటుక___జ్ఞానము
గీతాభవనము అతి విశాలమైనది. అతి సుందరమైనది. అందలి ఒక్కొక్క గది యందు చిత్రవిచిత్రములైన అమూల్యపదార్ధములు ఉంచబడినవి. ఆ భవనము నందు ఎవరైనను ప్రవేశించవచ్చును. జాతి, కుల, మత లింగ వివక్ష లేదు. ప్రవేశరుసుము లేదు. అట్లు ప్రవేశించి ఆయా వస్తువులను నిరాటంకముగ దర్శించవచ్చును, స్పర్శించవచ్చును, ఎత్తుకుని ఇంటికి తీసుకుని వెళ్ళవచ్చును. అడ్డుపెట్టువారు లేరు, ఆటంకపరచువారులేరు. ఒకప్పుడు శంకరాచార్యులు ఆ గీతా భవనము లోనికేగి దాని సౌందర్యమును చూచి ముగ్ధులై తన ఇచ్చవచ్చిన పదార్ధముల నటనుండి గ్రహించివెళ్ళిరి. తదుపరి రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, మరి ఎంతోమంది గీతాభవనమును సందర్శించి,అందలి వస్తువులను పట్టుకొని వెళ్ళినను, తిరిగి ఆ భవనము సమస్త పదార్ధములచే పరిపూర్ణమై అక్షయముగ దనరుచున్నది. ఇదియె ఆ భవనము యొక్క విశిష్టత. కావున ముముక్షువులెల్లరు ఈ గీతా నామకమహోత్తుంగ సువిశాల భవ్యభవనంబును కనులపండువుగ వీక్షించి,అందు బహుకాలము విశ్రాంతిగొని, సేద తీర్చుకుని, సాంసారిక దుఃఖజాలము నుండి విముక్తులై పరమానంద మనుభవించి ధన్యులయ్యెదరుగాక !
గీత అంతరార్ధము.... పాండవ కౌరవ యుద్దము వాస్తవముగ ప్రతిజీవి యొక్క హృదయాంతరాళమున ప్రతిదినము సంభవించు ధర్మాధర్మ యుద్దము యొక్క సాక్షాత్ ప్రతిబింబము. జీవిత సంగ్రామమున మంచికి,చెడ్డకు, ధర్మమునకు, అధర్మమునకు, న్యాయమునకు,అన్యాయమునకు, సత్యమునకు,అసత్యమునకు నిమిషనిమిషమునకు పెద్ద పోరు జరుగుచుండును. ఆ పోరు నందు నిశ్చయాత్మకమగు బుద్ధి ఎంత శుద్ధముగ నుండిన,ఎంత వివేకయుక్తముగ నుండిన జీవునకు అంత విజయము చేకూరుచుండును. కనుకనే ఉపనిషత్తులందు దానిని సారధిగ చెప్పిరి.. రధము గమ్యస్థానమును నిరాటంకముగ చేరవలయుననిన, కుమార్గమును జేబట్టక సవ్యమైన పధముననే నడువవలెననిన, సారధి మహాప్రజ్ఞావంతుడుగను,కుశలుడు గను ఉండవలయును. శ్రీకృష్ణ పరమాత్మవంటి సారధి లభించినచో ఇక జీవితరధము మోక్షమను గమ్యస్థానము చేరకయుండగలదా? అర్జునుని సౌభాగ్యవశమున అతనికి ప్రజ్ఞాదురంధరుడగు అట్టి లోకేశుడే సారధిగ లభ్యమయ్యను. కర్తవ్యచ్యుతుడై ధర్మక్షేత్రమున వక్రమార్గమున జననుంకించిన అర్జునుని తన పాటవముచే నతడు సవ్యమార్గమున నడిపించెను. అతని భోధయే భగవద్గీత. అట్లే హృదయక్షేత్రమున ఆధ్యార్మనిశ్చయపరిపూర్ణమగు పవిత్రబుద్ది కర్తవ్యచ్యుతమగు మనస్సునకు భోధించు దివ్యభోద కూడా భగవద్గీతయే యగును.. అర్జునునివలె ప్రతిజీవియు తన జీవితరధము యొక్క కళ్ళెములను పరమాత్మ చేతియందుంచి ప్రవర్తించినచో,అతని అనుగ్రహముచే మోక్షరూప గమ్యస్థానమును అతి సులభముగ చేరుకొనగలడు.
గీతయొక్క రహస్యార్ధము(అంతరార్ధము) ఈ క్రింద తెలుపబడుచున్నది.
కురుక్షేత్రము........హృదయక్షేత్రము
అర్జునరధము......శరీరము
సారధియగు శ్రీకృష్ణుడు......ప్రజ్ఞానరూపమగు బుద్ధి(పరమాత్మ)
రధికుడగు అర్జునుడు.........చంచలమనస్సు
గుర్రములు......ఇంద్రియములు
కౌరవులు మరియు ప్రతిపక్ష సేన....కామక్రోధ, రాగద్వేష, అహంకార, మమకారాది దుర్గుణములు
పాండవులు మరియు స్వపక్ష సేన.........నిర్భయత్వ,భక్తి,శ్రద్దాది సద్గుణములు
అర్జున ధనస్సు.......సాధనచతుష్టయము
సంజయుడు......వివేకము
ధృతరాష్టుడు......అవివేకము, అవిద్య
దుర్యోధనుడు......కామము
భగవధ్గీత...జీవుని గూర్చి(మనస్సుని గూర్చి) ప్రజ్ఞానరూపమగు బుద్ది పలుకు హితవాక్యములు
మొదటి ఆరు అధ్యాయములు......కర్మషట్కము.....శ్రవణము
రెండవ ఆరు అధ్యాయములు.......భక్తి షట్కము...మననము
మూడవ ఆరు అధ్యాయములు.......జ్ఞానషట్కము...నిదిధ్యాసము
జీవిత రధమును విషయమార్గములందు నడుపుటయే బంధము; దైవమార్గమునందు నడుపుటయే మోక్షము.. ఇదియే గీతారహస్యము.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

గురువు అవసరం ................

భారతీయం: ఓం శ్రీ గురుభ్యోన్నమః ఓం శ్రీ మహా గణాధిపతయే నమః నూ...

నాన్న మాట అమ్మకి వేదం